సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత: కరోనా టెస్టులు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న సీఎం రేవంత్ ప్రస్తుతం ఇంటిపట్టునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న రేవంత్‌కు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుస సమీక్షలు, సమావేశాలతో బిజిబిజీగా గడుపుతున్న రేవంత్ రెడ్డి.. ఆకస్మాత్తుగా జ్వరం బారిన పడటంతో కరోనా పరీక్షలు చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సీఎంకు పాజిటివ్ నిర్ధారణ అయితే ఇటీవల సీఎంతోపాటు సమావేశాలు, సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా కోవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా
ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకిన ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారందరిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారితో కాంటాక్ట్ అయిన వారికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కరోనాను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఆక్సిజన్ సిలిండర్లను సరైన తీరుగా వినియోగించడం, పూర్తిస్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయడం వంటి విషయాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పరిధిలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబులు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆర్టీపీసీఆర్ కిట్లను అందజేయాలని మంత్రి రాజనర్సింహా ఆదేశించారు.












Click it and Unblock the Notifications