తలాక్ చెప్పే వ్యవస్థ మంచిది కాదు: ముస్లీం పర్సనల్ లా బోర్డుపై వెంకయ్య ఫైర్
ఢిల్లీ: ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యాఖ్యలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు ఖండించారు. యూనిఫాం సివిల్ కోడ్ ఇప్పుడు కొత్తగా తీసుకు వచ్చింది కాదన్నారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే చట్టాని తీసుకోచ్చారన్నారు. తలాక్ చెప్పే వ్యవస్థ మంచిది కాదని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు.
రాజకీయాల్లోకి రావాలనుకుంటే మద్దతిచ్చే వారితో వెళ్లాలని, అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదన్నారు. తలాక్ చెప్పే వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరముందన్నారు. దీనిపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరగాలన్నారు.

కాగా, యూనిఫాం సివిల్ కోడ్ పైన అభిప్రాయాలను కోరాలన్న లా కమిషన్ నిర్ణయాన్ని అఖిలభారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ), ఇతర ముస్లిం సంస్థలు గురువారం తీవ్రంగా విమర్శించాయి. ఈ ప్రక్రియను తాము బహిష్కరిస్తున్నామన్నాయి. ప్రభుత్వం తమ వర్గంపై యుద్ధం చేస్తోందని ఆరోపించాయి.
ఆ సంస్థల ప్రతినిధులు గురువారం విలేకరులతో మాట్లాడారు. విడాకులకు సంబంధించిన మూడుసార్లు తలాఖ్ అంశంపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఏఐఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి వలీ రెహ్మానీ, జామియత్ ఉలేమా ఎ హింద్ అధ్యక్షులు మౌలానా అర్షద్ మదానీ, ఇతర సంస్థల ప్రతినిధులు మాట్లాడారు.
ముస్లింలకు సంబంధించిన పర్సనల్ చట్టాల్లో లోపాలు ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిచేస్తున్నారన్నారు.
నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు. ఇతర చోట్ల హత్యలు వంటి సమస్యలను దేశం ఎదుర్కొంటోందని, యూనిఫాం సివిల్ కోడ్వంటి అంశాలపై అభిప్రాయాలను కోరడానికి బదులు, ఆ సమస్యలను పరిష్కరించి, శాంతి నెలకొనేలా ప్రభుత్వం చూడాలన్నారు.
పార్టీల్లోనూ భిన్న వాదనలు
యూనిఫాం సివిల్ కోడ్ పైన రాజకీయ పార్టీలు కూడా భిన్నంగా స్పందిస్తున్నాయి. దీన్ని అమలు చేయడం అసాధ్యమని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. వివిధ వర్గాల కోసం దేశంలో 200-300 పర్సనల్ చట్టాలు ఉన్నాయన్నారు.పురోగామి సమాజ స్థాపనే యూనిఫాం సివిల్ కోడ్ ఉద్దేశమని బీజేపీ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు.
టర్కీ, ఇరాన్, ఇండొనేషియా వంటి దేశాలు కూడా స్త్రీ, పురష సమానత్వం కోసం చట్టాలని మార్చాయన్నారు. దీనిని శివసేన సమర్థించింది. ఎంత కాలం ముస్లింలు జాతీయ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారని, దీని వల్ల ఆ సమాజం, ముఖ్యంగా అందులోని మహిళల కష్టాలు తీరుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. దీని వల్ల దేశంలో భిన్నత్వం ఖూనీకి గురవుతుందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications