డబ్బు అర్జెంట్ అవసరం.. తక్కువ ధరకు బంగారు ఆభరణాలు అంటే నమ్మి కొంటున్నారా?
బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. విపరీతంగా బంగారం ధరలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో బంగారం కొనాలి అనుకునేవారు బంగారం షాపుల వైపు చూసే సాహసం కూడా చేయడం లేదు. ధర తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోక పోయామే అని తెగ బాధపడుతున్నారు. ఇక ఇదే సమయంలో ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే ఆసక్తి చూపిస్తున్నారు.
తక్కువ ధరకు బంగారు ఆభరణాలు.. నయా దందా
తక్కువ ధరకు బంగారు ఆభరణాలను ఎవరైనా అమ్ముతామని చెబితే అస్సలు విని మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. లక్ష రూపాయలకు బంగారం ధర చేరువ కావడంతో ఇప్పుడు అందరూ బంగారం పైనే చర్చిస్తున్నారు. ఇక ఇదే సమయంలో తాము ఇటీవలే బంగారు ఆభరణాన్ని చేయించుకున్నామని, డబ్బు చాలా అత్యవసరం కావడంతో దానిని అమ్మాలి అనుకుంటున్నామని కొందరు జ్యూయలరీ వ్యాపారం చేసే వాళ్ళ ద్వారా రంగంలోకి దిగారు. నయా దందాకు శ్రీకారం చుట్టారు.

బాగా డబ్బు అవసరం అంటూ బంగారు ఆభరణాల విక్రయ ముఠా
తరుగు అవేవీ లేకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బంగారం ధరకు తాము చేయించుకున్న ఆభరణాన్ని ఇస్తామని పలువురు మార్కెట్లో బంగారు ఆభరణాలను విక్రయించేందుకు రంగంలోకి దిగారు. ఆ బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేస్తే 70, 80 వేల రూపాయలు ఆదా అవుతాయని, తాము డబ్బులు బాగా అవసరం ఉన్న కారణంగానే అనుకుంటున్నామని నమ్మబలుకుతున్నారు. విక్రయించే బంగారాన్ని చెక్ చేయించుకోవాలని కూడా చెబుతున్నారు.
పక్కా మోసం... జాగ్రత్త
అయితే ఇటువంటి బంగారు ఆభరణాలను పొరపాటున కూడా కొనద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారు షాప్ లలో బంగారాన్ని చెక్ చేసినప్పటికీ అది బంగారం గానే కనిపిస్తుందని, కానీ ఆభరణం మొత్తం బంగారం కాదని, జనాలను మోసం చేయడానికి బంగారం పేరుతో ఇప్పుడు కొంతమంది మోసగాళ్లు హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ వంటి నగరాలలో తిరుగుతున్నారని చెబుతున్నారు.
ప్రజల అత్యాశను క్యాష్ చేసుకునే పనిలో కేటుగాళ్ళు
కనుక ఎవరు పొరపాటున కూడా ఇటువంటి వారిని నమ్మి వాళ్ల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కొనుగోలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. బంగారం ధర లక్ష రూపాయలకు చేరువ కావడంతో, తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి ప్రజల అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు.












Click it and Unblock the Notifications