ఆ ఉద్యోగులకు దసరా కానుక..15ఏళ్ళ కల నెరవేర్చిన సీఎం రేవంత్!
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మూడు వేతన సవరణ కమిషన్ల బకాయిలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దివ్యాంగ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంతోకాలంగా వారు డిమాండ్ చేస్తున్న పిఆర్సి బకాయిల అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దివ్యాంగ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ కానుక
2010, 2015, 2020 పిఆర్సిలను ప్రభుత్వం ఆమోదించి తక్షణం అమలు చేయడంతో దివ్యాంగ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. దసరా పండుగ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తీసుకున్న ప్రభుత్వానికి, తెలంగాణ మంత్రులకు, ఉన్నతాధికారులకు తన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం పిఆర్సిలను ఆమోదించడంతో సవరించిన జీతాలు దసరా పండుగకు ఉద్యోగుల ఖాతాలలో జమ అయ్యాయి.

ప్రతి ఉద్యోగికి 55వేల రూపాయలను మించి జీతంలో పెరుగుదల
ఈ పెరుగుదల కారణంగా ప్రతి ఉద్యోగికి 55వేల రూపాయలను మించి జీతంలో పెరుగుదల లభించినట్టు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వెల్లడించారు. దివ్యాంగ ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా పిఆర్సి కోసం పోరాటమే చేస్తున్నారని, గత ప్రభుత్వం దివ్యాంగుల డిమాండ్లను పట్టించుకోలేదని, దీనివల్ల వారు తీవ్ర నిరాశతో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
దివ్యాంగుల జీవితంలో నిజంగానే దసరా పండుగ
ఎట్టకేలకు ప్రస్తుత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దివ్యాంగుల జీవితంలో నిజంగానే పండుగను తెచ్చిందని అభిప్రాయపడ్డారు. దసరా పండుగ వేళ వారికి నిజంగానే బహుమతి ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు ఉద్యోగులు పెరిగిన జీతాలను తీసుకున్నారని, సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు.
దివ్యాంగులకు నిజమైన సంక్షేమ ప్రభుత్వం
ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన వేతనాలతో ఉద్యోగులు సంతోషంగా దసరా పండుగను జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దివ్యాంగులకు నిజమైన సంక్షేమ ప్రభుత్వమని నిరూపించుకుందని వీరయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications