కవిత, రేవంత్ రెడ్డిలపై ఈసీ సీరియస్; ఎమ్మెల్సీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదు!!
తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. ఈరోజు ఓట్ల పండుగలో ఓట్లు నమోదు చేస్తున్న ఓటర్లు ఎన్నికల బరిలో ఉన్న 2290 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు. దీంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది. ఒకపక్క ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంటే, మరోపక్క చిన్న చిన్న సంఘటనలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
తాజాగా ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్ లో తాను ఓటు హక్కును వినియోగించుకున్న క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఈసీ దాకా వెళ్ళిన విషయం తెలిసిందే. ఓటు వేసిన తర్వాత కవిత బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ పార్టీ కవిత పై ఫిర్యాదు చేయడంతో దృష్టి సారించింది ఈసీ. అంతేకాదు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కూడా ఈసీ సీరియస్ అయింది.

ఈ క్రమంలో తాజాగా ఎన్నికల సీఈవో వికాస్ రాజ్ కవిత, రేవంత్ రెడ్డి లు చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఈవీఎంల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చామని, అర్బన్ ఏరియాలలో ఇంకా పోలింగ్ శాతం పెరగాలని, పోలింగ్ పెరుగుతుందని అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయని పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తమకు వచ్చిన ప్రతి ఫిర్యాదులపైన జిల్లా ఎన్నికల అధికారిని రిపోర్ట్ అడిగామని వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ల పైన తనకు ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్న వికాస్ రాజ్ కవిత వ్యాఖ్యలపై జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇచ్చామని, కవిత చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదయిందని పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని, నేతలు ఎవరు నిబంధనలను అతిక్రమించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లో డి ఏవి స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం ఎంఎల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇదే కవితపై ఎఫ్ఐఆర్ నమోదుకు కారణమయ్యింది.












Click it and Unblock the Notifications