పైలట్ రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులోనే ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19న హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈడీ నోటీసులపై రోహిత్ రెడ్డి కూడా ధృవీకరించారు.
అయితే, ఇంకా తాను నోటీసులు చూడలేదని రోహిత్ రెడ్డి తెలిపారు. ఏ కేసులో నోటీసులు ఇచ్చారో తెలియదన్నారు. తన బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలు అడిగారని రోహిత్ చెప్పారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

మరోవైపు, సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో గతంలో రకుల్ సహా పలువురు టాలీవుడ్ నటీనటులను విచారించిన విషయం తెలిసిందే.
గత ఏడాది సెప్టెంబర్ 3న రకుల్ ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి తాజాగా, ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం మరోసారి మిగితా వారిని కూడా ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications