election commission evm tampering telangana congress tpcc hyderabad ఎన్నికల సంఘం ఈవీఎం తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ హైదరాబాద్
ఈవీఎంలపై మరోసారి ఎన్నికల సంఘం వివరణ, కాంగ్రెస్ ఆరోపణలకు జవాబేంటి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీరుపై ఆరోపణల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అప్రజాస్వామిక పద్దతిలో పోలింగ్ జరిగిందని ఆందోళనలు చేపడుతున్నారు. ఎన్నికల సంఘం పనితీరును తప్పుపడుతూ ఒంటి కాలిమీద లేస్తున్నారు. పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య తేడా ఉందంటూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరినా ఈసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫైరవుతున్నారు.

ఈసీ.. గురిచూసి..!
అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామిక పద్దతిలో జరగలేదంటూ ఎన్నికల సంఘంపై పోరాటం ప్రకటించారు కాంగ్రెస్ నేతలు. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ అంశంతో కేంద్ర ఎన్నికల సంఘం తీరును పోల్చారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర ఆందోళన చేపట్టారు. అయితే మొదటినుంచి కూడా ఎన్నికల సంఘం అధికారులు, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు. అయినా కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈవీఎంలపై మరోసారి మాట్లాడిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్.. అనుమానాలు అక్కర్లేదన్నారు.

ట్యాంపరింగ్ జరగలే..!
ఈవీఎంలపై అపోహలు అవాస్తవమనే విషయం సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పిందన్న రజత్ కుమార్.. ట్యాంపరింగ్ జరిగిందనడం పూర్తి అబద్దమన్నారు. దీనిపై వివాదాలు అనవసరమని వ్యాఖ్యానించారు. ఒకవేళ ట్యాంపరింగ్ జరిగిందని ఆధారాలతో నిరూపించేందుకు ఎవరైనా సిద్ధమైతే స్వాగతిస్తామన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

ఆరోపణలు సరికాదు
ఈవీఎం, వీవీ ప్యాట్ ల వినియోగం కొత్త కాదన్న విషయం కొందరు గుర్తించాలని.. సడెన్ గా తెరమీదకొచ్చి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మాజీ ఎన్నికల చీఫ్ కమిషనర్ ఓపీ రావత్ తో పాటు తన పేరు నాంపల్లి సెగ్మెంట్ లోని ఓటరు జాబితాలో ఉండటంపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. కొత్త ఓటర్ల నమోదు విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇప్పటిదాకా 16 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1950 గతంలో కూడా ఉందని గుర్తుచేసిన రజత్ కుమార్.. టెక్నికల్ గా అభివృద్ధిపరిచి తిరిగి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎన్నికలకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులుంటే ఆ నెంబర్ కు కాల్ చేయొచ్చని సూచించారు.