
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు
హైదరాబాద్: మనుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నోటీసులు జారీ చేసింది. రాజగోపారెడ్డి దాదాపు రూ. 5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంక్ ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా మునుగోడు ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించి పలు పత్రాలను ఈసీకి సమర్పించారు. ఆ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోకముందే 22 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని ఆయన కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహా భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. రాజగోపాల్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటల్లోగా సమాధానం చెప్పాలని, వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాదని నిరూపించుకోవాలని పేర్కొంది.
కాగా, టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ నగదు బదిలీపై ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి కొట్టిపారేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని హండిపడ్డారు.