కవితకు మంత్రి పదవి అడిగారు, కానీ..: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ కల్వకుంట్ల కవిత గురించి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు కేంద్ర మంత్రి పదవి కోసం టిఆర్ఎస్ ప్రయత్నించిందని, టీఆర్ఎస్ ప్రతిపాదనకు బిజెపి అంగీకరించలేదని ఆయన బుధవారంనాడు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ప్రణాళిక బెడిసి కొట్టడంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరడానికి గానీ బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి గానీ తాము ప్రయత్నించలేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తమకు బిజెపితో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవని ఆయన అన్నారు. బిజెపి నాయకులతో మండలి, భవిష్యత్తు ఎన్నికలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

తమది కార్యకర్తల పార్టీ అని, ఏ ఒక్కరిపైనో అది ఆధారపడి లేదని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు బుధవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టిడిపి నేతలను కలిశారు. బిజెపి శాసనసభ్యులు రామచంద్రా రెడ్డి, ప్రభాకర్ తదితరులు టిడిపి నాయకులతో సమావేశమయ్యారు. మండలి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇచ్చే విషయంపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయి.
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతుందని తెలంగాణ టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి సాఽధించినదేమిటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ పిచ్చి పనులు చేయకుండా ప్రాజెక్టుల నిర్మాణంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాదుల జోలికి వెళితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications