బాబు స్టీఫెన్‌తో మాట్లాడితే తప్పేమిటి: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కుట్రలు చేస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో అభ్యంతరకరం ఏముందని తెలంగాణ టిడిపి నేతలు ప్రశ్నించారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడిన సంభాషణల్లో తప్పేమీలేదని తెలంగాణ తెలుగుదేశం శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వేచ్చగా ఓటేయమన్నారు తప్ప తమ పార్టీలోకి రావాలని, డబ్బులిస్తా అని ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు.
స్టీఫెన్‌సన్ తనకు అప్పులున్నాయని, రేవంత్‌ను రావాలని పదేపదే కోరడంతోనే ఆయన అక్కడికి వెళ్లారని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన కుటుంబ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నందుకే రేవంత్ రెడ్డిపై కుట్ర పన్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. అధికారాన్ని వినియోగించుకుని ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కడానికి కేసీఆర్ చేసిన కుట్రలో టెలిఫోన్ సంభాషణలు ఒక భాగమని కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేల మానసిక స్థితిని దెబ్బతీసేందుకు కొన్ని టీవీలు, పత్రికలు ప్రయత్నిస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ వాయిస్ రికార్డు అయి ఉంటే వెంటనే సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ పెద్దలు తమపై కుట్రలు చేస్తున్నారన్నారు. తనకు, నామా నాగేశ్వరరావుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సండ్ర తెలిపారు. తాను పెద్దల ఇంట్లో పాలేరును కానని, తనకు ఆత్మగౌరవం ఉందన్నారు. అందుకే రాజకీయంగా ఎదిగానని ఆయన అన్నారు.
స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబు కాదని, అది చంద్రబాబు వాయిస్ కాదని తెలంగాణ టిడిపి నేత ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఒకవేళ చంద్రబాబు వాయిస్ అయితే...కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పటి నుంచి రేవంత్ వ్యవహారం వరకు సీబీఐ విచారణ జరిపించాలని ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications