బొత్సాను తెలంగాణకు రానివ్వం: భగ్గుమన్న ఎర్రోళ్ల శ్రీనివాస్; ఎమ్మెల్యే సండ్ర!!
తెలంగాణ విద్యా వ్యవస్థ పై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులపై, ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ మంత్రులు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ హితువు పలికారు. తెలంగాణ విద్యా వ్యవస్థ మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ముందు మీ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో చూసుకోవాలని హితవు పలికారు. బొత్స వ్యక్తిగతంగా మాట్లాడారా లేక ఇది ప్రభుత్వ విధానమా అన్నది స్పష్టం చేయాలని సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

తెలంగాణ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ సమాజం పైన, సీఎం కేసీఆర్ పైన, తెలంగాణ మంత్రుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు రాజకీయ విమర్శలు చేసుకోవాలనుకుంటే ఏపీలో చేసుకోవాలి కానీ తెలంగాణ గురించి మాట్లాడితే మంచిది కాదన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. ఇలాగే మాట్లాడితే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగనివ్వమని స్పష్టం చేశారు. కాగా విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాలు ఇచ్చిన తర్వాత మంత్రి బొత్సా సత్యనారాయణ ఏపీ విద్యావిధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడడం సరికాదని వ్యాఖ్యానించారు.
అక్కడంతా చూచిరాతలు, కుంభకోణాలు రోజు చూస్తున్నాం అంటూ తెలంగాణ విద్యా వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు. టిఎస్పిఎస్సి ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లీకేజీల స్కామ్ పై ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రానిదని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే దుమారానికి కారణమయ్యాయి.












Click it and Unblock the Notifications