ముఖ్యమంత్రే శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తారా?: కేసీఆర్‌పై ఈటల, డీకే అరుణ్ విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. సోమవారం కొల్లాపూర్‌లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులకు ఈటల హాజరై మాట్లాడారు.
Recommended Video

సీఎం స్థానంలో ఉండి దాడులు చేయమంటారా?: కేసీఆర్‌పై ఈటల
శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం కేసీఆర్ దాడులు చేయమంటున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులను, రైతులను సీఎం మోసం చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ప్రగతి భవన్‌కు ఇనుప కంచె వేసి లోపలికి ఎవరినీ రానివ్వరని ఆక్షేపించారు. సంబంధిత శాఖల మంత్రులు లేకుండానే సీఎం సమీక్షలు జరపడం ఏంటని ఈటల ప్రశ్నించారు. హుజూరాబాద్ దెబ్బతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారని ఈటల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా అంటూ డీకే అరుణ ఫైర్
కాగా, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. అంతేగాక, మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోలీసులపై విమర్శలు చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే శవయాత్రలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, పోలీసులా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలా అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆందోళనలకు అనుమతి ఇవ్వరు కానీ, టీఆర్‌ఎస్ నిరసనలకు రక్షణనిస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం డీజీపీ గారూ.. అంటూ ఆమె మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు.. టీఆర్‌ఎస్ కార్యక్రమంలో కార్యకర్తల్లా పాల్గొంటారు.. పోలీసుల ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నా అని డీకే అరుణ మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి అంటూ ఆమె హితవు పలికారు.

బీజేపీ ఎదుగుదల కేసీఆర్‌కు మింగుడుపడటం లేదు: పొంగులేటి
సీఎం కేసీఆర్.. రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వంపైపై నిరసనలకు దిగుతామనడం దారుణమని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారని, కేసీఆర్‌కు ఇది మింగుడుపడటం లేదని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల్ని తరిమికొట్టాని సీఎం పిలుపునివ్వడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్- టిఆర్ఎస్ కలిసి చేస్తున్న రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి సుధాకర్ అన్నారు. కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.












Click it and Unblock the Notifications