కేసీఆర్‌కు సలాం: నయీం ఎవరో తెలియదన్న మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి
హైదరాబాద్: నయీం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి లకిడికాపూల్ లోని అశోకా హోటల్‌ను ఎంచుకున్నారు. తొలుత నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు దినేశ్ రెడ్డి మీడియాకు ఆహ్వానం పంపారు.
చివరి నిమిషంలో
మీడియా సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు దినేశ్ రెడ్డి నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. ఆ వెంటనే సదరు మీడియా సమావేశాన్ని రద్దు చేయలేదని, బీజేపీ ఆఫీస్ నుంచి అశోకా హోటల్‌కు మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ప్రెస్ మీట్ ప్రారంభమైన వెంటనే బీజేపీ ఆఫీస్‌లో ఏసీ పనిచేయని కారణంగానే మీడియా సమావేశం వేదిక మార్చామని ఆయన ప్రకటించారు.
ఏసీ లేని చోట మీడియా సమావేశం ఇబ్బందిగా ఉంటుందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నయీం కేసును సిట్ నిక్షప్తపాతంగా దర్యాప్తు జరుపుతోంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

నయీం కేసు వెనుకున్న వారందరినీ బయటకు తేవాలని అన్నారు. మాజీ డీజీపీ అంటూ తనపై పరోక్షంగా ఆరోపణలు చేశారని ఓ ఛానెల్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మీడియా అందులోనూ ప్రత్యేకించి ఎన్టీవీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు టీవీ ఛానెల్ ప్రసారం చేస్తున్నట్లు నయీంకు మాజీ డీజీపీతో సంబంధాలున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది డీజీపీల్లో నేనూ ఒకడినని అన్నారు. మాజీ డీజీపీపై ఆరోణపలు వచ్చిన క్రమంలో వివరణ ఇవ్వడం నా బాధ్యత అని చెప్పారు. నయీంను అంతమొందించడం మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పోలీసులకు అభినందనలు తెలిపారు. నయీంను చంపడం మంచిదేనని అన్నారు.
నయీం ఎన్ కౌంటర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన సలాం కొట్టారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టులను పోలీసు ఇన్ ఫార్మర్లుగా వాడుకోవడం సహజమేనన్నారు. ఏ డీజీపీ స్థాయి అధికారికి గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలు ఉండవని అన్నారు. తనతో పాటే డీజీపీగా పనిచేసిన ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా నయీమ్ తో సంబంధాలు ఉండే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.
అమాయకులకు అన్యాయం జరగొద్దన్న ఆయన... నయీమ్ ను హతం చేసిన తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నయీం వివరాలను సమర్పిస్తానని అన్నారు. తన హయాంలో కూడా నయీం అరెస్ట్‌కు ప్రయత్నించానని, కానీ అనుమతి రాలేదని ఆయన చెప్పారు. నయీం అరెస్ట్‌కు గత ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదని అన్నారు.
కేసులో అమాయకులకు ఇబ్బందులు రావొద్దని సూచించారు. నయీం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని, అప్పటి వరకు మీడియా ఆగలేదా అంటూ మండిపడ్డారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ పై నక్సల్స్ దాడి సందర్భంగా తాను ఆయన పక్కనే ఉన్నానని ఓ కథనం రాసిన ఓ మీడియా సంస్థ ఆ తర్వాత క్షమాపణ చెప్పిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆనాటి ఘటనలో వ్యాస్‌కు 400 మీటర్ల దూరంలో తాను ఉన్నానని, తామంతా స్పందించేలోగానే నక్సల్స్ పారిపోయారని ఆయన పేర్కొన్నారు. కాగా, నయీం ఎన్ కౌంటర్ పై దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు పరిమితులున్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాలను దినేశ్ రెడ్డి ఖండించారు.
మాజీ డీజీపీలనే కాకుండా ప్రస్తుతం డీజీపీ పోస్టులో ఉన్న ఐపీఎస్ అధికారిని కూడా విచారించే అధికారం సిట్‌కు ఉంటుందని చెప్పారు. ఈ విషయాలను తెలుసుకోకుండా మీడియా ఇష్టారాజ్యంగా కధనాలు రాయడం సరికాదని అన్నారు. నయీం ఎలా ఉంటాడో కూడా నిన్నటిదాకా తనకు తెలియదని ఆయన చెప్పారు.
మహబాబునగర్ జల్లాలోని షాద్‌నగర్‌లో నయీం చనిపోయిన తర్వాత మీడియాలోనే అతడి ఫొటోను మొదటిసారిగా చూశానన్నారు. అయినా నయీం లాంటి గ్యాంగ్ స్టర్లను విచారించడం డీజీపీ స్థాయి అధికారుల బాధ్యత కాదని చెప్పారు. అందుకోసం డీజీపీ స్థాయి కంటే కింద అధికారులు ఉన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications