కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ పొంగులేటి.. చేరికకు ముహూర్తం ఫిక్స్!!
తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రాజకీయవర్గాలలో ఇంకా ఆసక్తికరంగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు తమ పార్టీలో చేరాలని ఆహ్వానించగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై స్పష్టత వస్తుందని అందరూ భావించారు. అయితే అందుకు తగ్గట్టు తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ను గద్దె దించడం కోసం, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపధం చేసిన పొంగులేటి వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆచితూచి పార్టీలో చేరికపై అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కు పట్టు ఉన్న నేపధ్యంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే ఆయనకు, పార్టీకి లాభం జరుగుతుందని స్థానికంగానూ, ఆయన అనుచరుల్లోనూ చర్చ జరుగుతుంది. కెసిఆర్ వ్యతిరేకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ తో వ్యక్తిగతంగా దీనిపై చర్చించినట్లు సమాచారం .జూన్ 2వ తేదీన లేదా 8 వ తేదీన పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో ఏమేరకు నిజముందో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications