Exclusive:సీఎం రేవంత్ తన పని తాను చేసుకుపోలేరా.?కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం ఏంటి..?
తెలంగాణలో అధికారిక కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ బి.వినోద్ సంచలన కామెంట్స్ చేశారు. వన్ ఇండియాతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన ఆయన రాష్ట్ర పాలనపై కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం ఎందుకు చేసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి యువ ముఖ్యమంత్రి అని తన పని తాను చేసుకునేలా ఉండాలే తప్ప, పాలనపై ఏఐసీసీ అజమాయిషీ ఏంటని మండిపడ్డారు. పాలనా పరమైన అంశాలపై కాంగ్రెస్ జోక్యం అనవసరమని వినోద్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఎన్నో అనమానాలకు తావిస్తోందని అన్నారు. చీటికీ మాటికీ సీఎం రేవంత్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని వినోద్ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్తున్న ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవడం చూస్తే తెలంగాణలో ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటోందనే విషయం స్పష్టమవుతోందని వినోద్ చెప్పుకొచ్చారు.రేవంత్ సొంత నిర్ణయాలు తీసుకునేలా ఉండాలని, తన మార్క్ పాలన అందించాలని వినోద్ కోరారు. పలు కీలక సమావేశాల్లో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ దీప్‌దాస్ మున్షీ ఎందుకు కనిపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని వినోద్ చెప్పారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతోందంటూ ఒక వార్త దావనంలా వ్యాపించింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్‌గా కూడా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అంతేకాదు ఈ సారి విమర్శలు సీఎం రేవంత్‌పై ఎక్కుపెట్టారు. రేవంత్ త్వరలోనే బీజేపీతో కలుస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి రేవంత్ తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మధ్య చర్చలు ముగిసినట్లు తన వద్ద సమాచారం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ గవర్నర్‌గా, కేటీఆర్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టేలా డీల్ కుదిరిందని రేవంత్ బాహాటంగానే చెప్పుకొచ్చారు.
ఇరు పార్టీలపై వచ్చిన ఆరోపణలను రెండు పార్టీలు ఖండించాయి.కానీ పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం చర్చ నడుస్తూనే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీతో కలవాలని భావించిన, లేదా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు రేవంత్ కమలం గూటికి చేరాలన్నా అందుకు సమయం చాలా ఉంది.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చాలా ఉండగా ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలు జరగవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications