హైదరాబాద్ నడిబొడ్డున.. అలనాటి రాజసౌధం.. ఫలక్ నుమా ప్యాలెస్ ప్రత్యేకతలు ఇవే..?
హైదరాబాద్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. శాతవాహనుల కాలం నుంచి నిజాం రాజుల కాలం వరకు ఆనాటి రాజులు, నవాబులు ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించారు. వీటిల్లో చార్మినార్, గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్, కుతుబ్ షాహీ సమాధులు, సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, పురానా ఫుల్.. ఇలా అనేకం ఉన్నాయి. ఈ కట్టడాలు కుతుబ్ షాహీలు, నిజాంల కాలం నాటి వాస్తు శిల్పి, నగర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అయితే వాటితో పాటు తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్, బ్రిటిష్ రెసిడెన్సీ కట్టడాలు కూడా పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్ లో ఆయన బస చేశారు. దాంతో మరోసారి ఈ చారిత్రక కట్టడం వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాల్లో ఫలక్ నుమా ప్యాలెస్ అత్యంత విలాసవంతమైన భవనంగా పేరుగాంచింది. ఫలక్ నుమా ప్యాలెస్ చార్మినార్ కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొండపై ఉంటుంది. ఈ అందమైన భవనానికి ఈ పేరు పెట్టడానికి గల కారణం కూడా చారిత్రక కథనాల్లో ఉంది. ఉర్దూలో 'ఫలక్' అంటే ఆకాశం అలాగే'నుమా' అంటే ప్రతిబింబం అని అర్ధం వస్తుంది. అంటే Mirror of the Sky అని అర్థం వచ్చేలా ఈ భవనానికి నామకరణం చేశారు.
ఈ ప్యాలెస్ చరిత్ర చూస్తే.. ఆరో నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయాంలో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. అప్పటి నిజాం ప్రధాని నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా.. 1893లో దీన్ని సుమారు రూ.40 లక్షల ఖర్చుచేసి నిర్మించారు. దాదాపు 32 ఎకరాల స్థలంలో, 2000 అడుగుల ఎత్తున్న ఒక చిన్న కొండ మీద ఈ ప్యాలెస్ ను నిర్మించారు. ఈ భవనం నిర్మించిన తర్వాత నిజాం ప్రభువు మరణించేవరకూ ఈ భవనంలో ఉన్నారు. ఇక ఫలక్ నుమా ప్యాలెస్ విశేషాలు చూస్తే.. భవనంలో మొత్తం 60 గదులు, 22 హాళ్లు ఉన్నాయి. ఈ రాజ ప్రసాదంలో 5 వేల పుస్తకాలు ఉండే ఓ గ్రంథాలయం కూడా ఉంది. నిజాంలు పలు పర్యటనల్లో సేకరించిన బోలెడు వస్తువులు ఇందులో ఉన్నాయి.

ఈ భవనంలోనే గోల్ బంగ్లా ,విక్టోరియన్ జేడ్ రూమ్, ఇంగ్లాండులో ప్రత్యేకంగా చేయించిన బిలియర్డ్ టేబుల్స్, 80 అడుగుల పొడవు, 101 కుర్చీలున్న ప్రపంచంలోనే పొడవైన డైనింగ్ రూమ్.. ఇవన్నీ ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో తాజ్ గ్రూపు లీజుకు తీసుకుని మరింత మెరుగులు దిద్దింది. అప్పటి నుంచి తాజ్ ఫలక్ నుమా పేరిట విలాసవంతమైన హోటల్ గా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో అతి ఖరీదైన హోటళ్లలో ఇది ఒకటిగా ఉండటం విశేషం. అలాగే వందల ఏళ్లనాటి రాజభవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications