బిజెపి, శివసేన కనుసన్నల్లో మజ్లీస్: దిగ్విజయ్, కెటిఆర్ ఓ బచ్చా అని ఉత్తమ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పాలనపై కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ విమర్శలు చేశారు. తెరాసది కుటుంబ పాలన అని, ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. 2019లో తెలంగాణలో కాంగ్రెసుదే అధికారమని ఆయన జోస్యం చెప్పారు. విదేశాల నుంచి భారతీయుల డబ్బులు తెస్తానని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా ఆ పనిచేయలేదని ఆయన విమర్సించారు.
కాంగ్రెసు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికలపై హైదరాబాదు నగర కాంగ్రెసు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని ఆయన విమర్శిచారు. మజ్లీస్ బిజెపి, శివసేన కనుసన్నల్లో పనిచేస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
టిడిపికి ఓటు వేస్తే అది వృధా అవుతుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టిడిపి కనుమరుగు అయినట్లేనని అభిప్రాయపడ్డారు. హైదరాబాదుకు తెరాస చేసిందేమి లేదని అన్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించకపోతే తాను రాజీనామా చేస్తానని తెలంగాణ మంత్రి కెటి రామరాావు చేసిన సవాల్‌పై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ స్పందించారు. కెటిఆర్ ఓ బచ్చా అని ఆయన వ్యాఖ్యానించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్తే తాము దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు.
తెరాస, మజ్లీస్ ఇష్టారాజ్యంగా హోర్డింగులు పెట్టారని కాంగ్రెసు నేత షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాదుకు గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెరాస ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని సిఎల్పీ నేత కె. జానారెడ్డి విమర్శించారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం కోసం తెరాస నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెరాస పాలనలో సెటిలర్లు భయపడుతున్నారని, వారికి తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications