కుర్చీ వేసుకొని కూర్చుంటానన్నావ్: కెసిఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్యాయత్నం
మహబూబ్ నగర్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా పంటలకు సాగునీరు అందడం లేదంటూ మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం బొంకూరుకు చెందిన యువరైతు ఒకరు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజోలి సమీప సుంకేశుల బ్యారేజీ వద్ద బుధవారం అతను పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.
వెంటనే అతనిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సదరు యువ రైతు, ఆయన అన్న.. ఇద్దరు కూడా ఒకటిన్నర ఎకరంలో కంది పంటను సాగు చేశారు. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని ఆముదం వేశారు. వర్షాలు లేక, ఆర్డీఎస్ నుంచి నీరు రాక పంటలు దెబ్బతిన్నాయి.
దీంతో, లక్షల మొత్తంలో అప్పులు చేశారు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. యువరైతు వద్ద పోలీసులు రెండు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ లేఖ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాసినట్లుగా ఉంది.

ఆ లేఖలో... ఆర్టీఎస్ చివరి నుంచి ఆయకట్టుకు నీరు రావడం లేదని, రాజోలిబండ వద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటానని చెప్పిన కెసిఆర్ తాము సాగు చేసిన పంటలకు నీరు అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చదువుకున్న వారికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనవ్నానని, నా ఆత్మహత్యతోనైనా అలంపూర్‌కు నీళ్లు రావాలని అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications