టీ అసెంబ్లీ: రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రకటన, ఎడ్లబండిపై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసనసభలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరగనుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన చేయనున్నారు.
రైతుల అత్మహత్యలపై విపక్షాలు ఇరుకున పెడతాయని గమనించిన సీఎం కేసీఆర్, ముందుగా తాను ఓ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈరోజు శాసనసభ సమావేశాల్లో కేవలం రైతు ఆత్మహత్యలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఇందులో భాగంగా రైతుల ఆత్మహత్యలపై చర్చించే సమయంలో ఆటంకం కలగకూడదనే భావనతో ఈరోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను సైతం రద్దు చేశారు. ఈ నెల 23నే సమావేశాలు అధికారికంగా ప్రారంభమైనా, తొలి రోజు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిలకు సంతాపం ప్రకటించిన సభ, ఈరోజుకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీకి ఎడ్లబండిపై ఎర్రబెల్లి
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి మంచి వాడీవేడీగా సాగనున్నాయి. దీంతో తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుతో సహా, ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎడ్ల బండ్లు ఎక్కి అసెంబ్లీకి వినూత్నంగా నిరసన తెలిపేందుకు బయల్దేరారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై సర్కారు తీరును నిరసిస్తూ ఎర్రబెల్లి ఎడ్ల బండిపై అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎడ్ల బండి ఎక్కి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అయితే అసెంబ్లీకి కాస్త దూరంలోనే ఎర్రబెల్లి ఎక్కిన ఎడ్ల బండిని పోలీసులు అడ్డుకున్నారు.
అసెంబ్లీ లోపలికి ఎడ్ల బండ్లకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎడ్ల బండి దిగి కారెక్కాలని ఎర్రబెల్లికి విజ్ఞప్తి చేశారు. అయితే అసెంబ్లీ ఆవరణలోకి ఎడ్ల బండ్ల ప్రవేశంపై నిషేధం ఎక్కడుందో చూపాలంటూ ఎర్రబెల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడి కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications