రైతులకు శుభవార్త: ఆ ప్రాజెక్ట్ తో రెట్టింపు ప్రయోజనాలు!!
తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన సోలార్ విప్లవానికి ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామం సాక్షిగా నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సోలార్ మోటార్ల పైన శుభవార్త చెప్పారు.
నూతన సోలార్ ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బోనకల్ మండలంలో ఈ నూతన సోలార్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన భట్టి విక్రమార్క ప్రజలు విద్యుత్ శాఖకు బిల్లును చెల్లించే రోజులు పోయాయని, బదులుగా విద్యుత్ శాఖనే ప్రజలకు డబ్బులు చెల్లించే కాలం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. దీనికోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాలలో సోలార్ మోటార్ల పథకాన్ని, సోలార్ ప్యానెల్స్ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు.

బోనకల్ మండల పరిధిలోనే 306కోట్ల రూపాయలు
ఈ వినూత్న ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిని స్వయం సమృద్ధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే. పర్యావరణ పరిరక్షణతో పాటు, స్థానిక కుటుంబాలకు, రైతాంగానికి ఆర్థిక భద్రత కల్పించడం ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతుందని తెలంగాణ డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 81గ్రామాలలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా, ఒక బోనకల్ మండల పరిధిలోనే 306కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు.
రైతులకు ఈ స్కీం లో రెట్టింపు లాభాలు
గృహ వినియోగదారులతో పాటు రైతులకు కూడా ఈ పథకం ద్వారా రెట్టింపు లాభాలు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో పొలాల లోని వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. పంటలు పండించిన సమయంలో లేదా మోటార్లు ఉపయోగించినప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్తు గ్రిడ్ కు అనుసంధానం చేయబడుతుందని దీనివల్ల రైతులు అదనపు లాభాన్ని సంపాదించవచ్చు అన్నారు.
సోలార్ ఎనర్జీ ద్వారా కాలుష్య రహిత సమాజం దిశగా అడుగులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఈ ప్రాజెక్టు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సహజ వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, కాలుష్య రహిత సమాజం దిశగా సోలార్ ఎనర్జీ ద్వారా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications