కోడికూర కోసం కొట్లాట.. తలలు పగిలేలా కొట్టుకున్న యూనివర్సిటీ విద్యార్థులు!
యూనివర్సిటీలో చదువుకోవటం కోసం వచ్చిన విద్యార్థులు కోడికూర కోసం కొట్లాడుకున్న ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత చదువులకై వచ్చిన విద్యార్థుల మధ్య కోడికూర విషయంలో జరిగిన ఘర్షణ అది చిలికి చిలికి గాలివానగా మారి తలలు పగలగొట్టుకునే వరకు వెళ్ళింది. కామన్ మెస్‌లో MBA, ఎకనామిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కోడికూర కోసం గొడవ పడ్డారు.
కోడికూర కోసం రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి
రెండు వర్గాలుగా విడిపోయి ఎవరూ ఊహించని విధంగా దాడి చేసుకున్నారు. మెస్‌లో చికెన్ పంపిణీలో తేడాలున్నాయనే ఆరోపణలతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి, చివరకు భౌతిక దాడులకు దారితీసింది. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకోవడంతో ఓ విద్యార్థి తల పగిలి తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రి పాలయ్యాడు. మరో ఇద్దరు విద్యార్థుల చేతులకు గాయాలయ్యాయి.

యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్ లో గొడవ
అయితే ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతకు ఒకరోజు ముందు కూడా, బాయిల్డ్ ఎగ్స్ విషయంలోనూ విద్యార్థుల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఘర్షణ పడిన వారంతా యూనివర్సిటీ న్యూ పీ.జీ హాస్టల్‌కు చెందిన వారని సమాచారం. వీరంతా చిన్న చిన్న విషయాలకే గత రెండు రోజులుగా గొడవలకు దిగుతున్నట్టు సమాచారం.
గొడవకు దిగిన వారిపై కేసు నమోదు
కోడికూర కోసం జరిగిన గొడవలో రాత్రి 11 గంటల వరకు క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు కారణమైన ఐదుగురు విద్యార్థులపై కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. వీరిపైన సెక్షన్లు 118(1), 351(2), r/w 3(5) BNS కింద పోలీసులు కేసులను నమోదు చేసి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.
యూనివర్సిటీలలో గొడవల పట్ల పలువురు అసహనం
పాఠాలు చెప్పి, భావితరం భవిత తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీలు ఇలా గొడవలకు వేదిక కావటం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత ఆశలతో వచ్చిన తమ పిల్లలు ఇలా కేసుల పాలు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications