మూడో విడత ఫలితాల్లోనూ అదే జోరు.. జగన్ పై చంద్రబాబు గెలుపు
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చివరి విడత పంచాయతీ కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా డిసెంబర్ 17 బుధవారం రోజున 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది, వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీలో నిలిచారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మూడో విడతలో భాగంగా 80.78శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 4,158 స్థానాలకు గాను 2,159 స్థానాలను ప్రకటించగా.. అందులో 1,239 స్థానాలతో అధికార కాంగ్రెస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ మద్దతుదారులు 567 స్థానాల్లో గెలుపొందారు. అలాగే బీజేపీ 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఇతరులు 263 స్థానాల్లో విజయం సాధించారు.
అయితే తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జగన్ పై కాంగ్రెస్ అభ్యర్థి చంద్రబాబు విజయం సాధించారు. రాజకీయాల్లోని ప్రముఖ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలవడంతో చాలా మందికి ఫలితంపై ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా వెల్లడైన ఫలితాల్లో బానోతు జగన్ పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు.
మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముసలాయిపల్లి గ్రామ సర్పంచ్ గా పవిత్ర నాగరాజ్ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున పోటీలోకి దిగిన ఆయన.. ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించడం విశేషం. అలాగే భద్రాద్రి జిల్లా గాంధీనగర్ లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే కామారెడ్డి జిల్లా జగన్నాథ్ పల్లి లో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్ల వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజం సాధించారు.

ఇక పంచాయతీ ఎన్నికలు మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పల్లెలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications