భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
గత కొద్ది రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. పలు జిల్లాలో వరద ఉద్ధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. హుస్సేన్‌సాగర్ తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
మరోవైపు, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం 34 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం 7 గంటలకు 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.

మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదనీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి. చర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరదనీరు పారుతుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం వరదనీటితో మునిగింది.
భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి ఛట్టి వద్ద వరదనీరు చేరడంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరదనీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మదిా ప్రవహిస్తోంది. మరోవైపు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 18.833 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి 14,063 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 1067.10 అడుగులకు చేరింది.












Click it and Unblock the Notifications