దేశంలోనే అరుదైన ప్రాణి: తెలంగాణలో కనిపించిన ల్యూసిస్టిక్ స్క్వారెల్
హైదరాబాద్: అది దేశంలోనే అరుదైన ప్రాణి. తొలిసారి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు కట్టపై దర్శనం ఇచ్చింది. అదే తెల్లని ఉడుత. దీనిపై చారలు పెద్దగా కనిపించవు. దీన్ని ల్యూసిస్టిక్ స్క్వారెల్ అని కూడా పిలుస్తుంటారు.

తెలంగాణలో ల్యూసిస్టిక్ స్క్విరెల్
అయితే, అధికారికంగా ఇప్పటి వరకు తెలంగాణలో ల్యూసిస్టిక్ స్క్విరెల్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. రామచంద్రపురంలోని ఈ ఉడుత తన తల్లి, తోబుట్టువుతో కలిసి చెట్లపై సందడి చేస్తోంది. దీంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వాటిని తిలకిస్తున్నారు. కాగా, ఇవి సాధారణంగా బూడిద-గోధుమ రంగులో మూడు చారలతో ఉంటాయి.

ల్యూసిస్టిక్ స్క్విరెల్ ఎందుకిలా ఉంటుంది?
నెహ్రూ జులాజికల్ పార్క్‌లోని వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ లక్ష్మణ్ ఈ జీవి గురించి మాట్లాడుతూ.. ల్యుసిసిమ్ ఒక అరుదైన పరిస్థితి, దీనిలో జంతువులో వర్ణద్రవ్యం కోల్పోవడం వల్ల చర్మం లేదా వెంట్రుకలు తెల్లగా, లేతగా లేదా పాచీ రంగులో ఉంటాయని తెలిపారు. ఉడుత కళ్లు మామూలుగా ఉండటంతో అది అల్బినో ఉడుత కాదన్నారు. అల్బినో జంతువుల కళ్లు సాధారణంగా గులాబీ రంగులో ఉంటాయని తెలిపారు. లూసిస్టిక్ జంతువులు తక్కువ కాలం జీవిస్తాయని ఆయన తెలిపారు. ఇందుకు కారణంగా ఇవి వేటాడే జంతువులకు సులభంగా దొరికిపోతాయన్నారు.

ఉడుతల్లో లూసిజం తక్కువ: 2016లో తొలిసారి తమిళనాడులో
ఉడుతలు వంటి చిన్న క్షీరదాలలో లూసిజం చాలా అరుదు అని తెలుస్తోంది. కాలుష్యం, పర్యావరణ ప్రత్యామ్నాయాలు, తక్కువ-నాణ్యత కలిగిన ఆహారం, ఫోలిక్యులర్ దెబ్బతినడం వంటి విభిన్న కారకాల వల్ల ల్యుసిజం సంభవించిందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. కాగా, దక్షిణ భారతదేశంలో 2016 సెప్టెంబర్ లో తొలిసారిగా లూసిస్టిక్ తాటి ఉడుత కనిపించింది. తమిళనాడులోని నీలగిరిలో దీన్ని గుర్తించారు. మిగిలిన రెండు దృశ్యాలుగా గోవా, మహారాష్ట్రలో వన్యప్రాణి నిపుణులు వీటిని గుర్తించారు.












Click it and Unblock the Notifications