తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు!
తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు, అమలవుతున్న పథకాలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో పాలనపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి శుభవార్త చెప్పారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో చేపలు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద అందించే ఆహారంలో ఇకపైన చికెన్ కు బదులుగా వారానికి ఒకరోజు చేపలు అందించనున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన మధ్యాహ్న భోజన పథకం గురించి కీలక విషయాలను వెల్లడించారు.

పిల్లలకు ఎటువంటి ఆటంకం లేకుండా కడుపునిండా పౌష్టికాహారం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద పోషకాహారం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించారని పేర్కొన్నారు. పిల్లలకు ఎటువంటి ఆటంకం లేకుండా కడుపునిండా పౌష్టికాహారం లభించేలా చూసేందుకు ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
వారానికి ఒకరోజు చేపలు అందించాలనే ఆలోచన
మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ కు బదులు వారానికి ఒకరోజు చేపలు అందించాలనే ఆలోచన ఉన్నట్టు గతంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమీక్షలో కూడా ఆయన వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోయినప్పటికీ పేదల సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చర్యల అధికారులు కృషి చేయాలని సూచించారు. వారానికి ఒకసారి హాస్టల్స్ ను తనిఖీ చేస్తున్నట్టు, ఏదైనా లోపం ఉంటే హాస్టల్ ఇన్చార్జ్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
చేపల ఉత్పత్తికి కూడా మత్స్యకారులకు తగిన సహాయం
ప్రతివారం విద్యార్థులకు పౌష్టికాహారంగా మధ్యాహ్న భోజనంలో చేపలు అందిస్తామని చెప్పిన మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందన్నారు. గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తికి కూడా మత్స్యకారులకు తగిన సహాయం చేస్తున్నామన్నారు. వారంలో ఒకరోజు చేపలను విద్యార్థులకు పెట్టడం ద్వారా మత్యకారులను కూడా ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications