Mangli: దుప్పటి కప్పుకొని ఇంట్ల పండుకో: సీమ బిడ్డకు తెలంగాణ ఏం తెలుసు: మైసమ్మ పాటపై దుమారం
హైదరాబాద్: తెలంగాణలో ఆషాఢం బోనాల జాతరను పురస్కరించుకుని ప్రముఖ గాయని మంగ్లీ విడుదల చేసిన ఓ పాట ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఆ పాటలో వాడిన కొన్ని పదాల పట్ల తెలంగాణకు చెందిన పలువురు నెటిజన్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ పాటలో మంగ్లి అమ్మవారిని చుట్టంగా, మోతెవరిలా అభివర్ణించడం ఈ దుమారానికి కారణమైంది.
Recommended Video
చెట్టు కింద కూసున్నవమ్మా, సుట్టం లెక్క ఓ మైసమ్మ.. అనే పాటలో మైసమ్మను కించపరిచారంటూ నెటిజన్లు ఆరోపణాస్త్రాలను సంధిస్తోన్నారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. మంగ్లి స్థానికతను కూడా ప్రశ్నిస్తోన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మంగ్లీకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలుసంటూ నిలదీస్తోన్నారు.
సినిమాల్లో అవకాశం కోసం..
దసరా పండుగను సారా అంటూ మంగ్లి సెటైర్లు సంధించారని, సినిమాల్లో నటించే అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా తెలంగాణ కళాకారులకు అన్యాయం జరుగుతోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. అమ్మవారిని మోతెవారిలాగా కూసున్నవమ్మా అంటూ మంగ్లీ తన పాటతో కించపరిచిందని, దీనికి పాట రాసిన రచయిత, పాడిన మంగ్లి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ నెటిజన్లు డిమాండ్ చేస్తోన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా..
పాట అంటే భక్తిని పెంచేదిలా ఉండాలని, దీనికి విరుద్ధంగా అమ్మవారిని చుట్టంలా, మోతెవరిలాగా, అక్కరకు రాని చుట్టంలా అభివర్ణించడం సరికాదని అంటున్నారు. సెలెబ్రిటీ హోదా రాగానే అహంకారం నెత్తికెక్కిందా? అని నిలదీస్తోన్నారు.
ఈ పాట సారంశం మొత్తం అమ్మవారిని మొక్కుతున్నట్టుగా కనిపించట్లేదని, తిడుతున్నట్లుగా ఉందని ధ్వజమెత్తుతున్నారు. భక్తి పేరుతో హిందూ దేవుళ్లను అపహాస్యం చేయడాన్ని ఎవరూ సహించబోరంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. హిందూ దేవుళ్లను తిడితేనే ఓవర్ నైట్ స్టార్‌డమ్ వస్తుందనే భ్రమలో ఉన్నారని నెటిజన్లు విమర్శిస్తోన్నారు.

లిరిక్ మార్చాల్సిందే..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా భావించే ఆషాఢం బోనాల సందర్భంగా గ్రామదేవత కోట్లాది మంది హిందువుల పూజలను అందుకునే మైసమ్మ అమ్మవారిని కించపరుస్తూ రాసిన ఈ పాటలోని పదాలను వెంటనే మార్చాలని నెటిజన్లు డిమాండ్ చేస్తోన్నారు. మంగ్లీని ఆమె పాటలు, ఆమె గొంతును ఇష్టపడే అభిమానులు తెలంగాణలో చాలామంది ఉన్నారని, దాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని హితబోధ చేస్తోన్నారు. అలాగని, హిందుత్వాన్ని, హిందు దేవుళ్లను చులకన చేయడం సరికాదని అంటోన్నారు.
కత్తి మహేష్ ఘటనను పోల్చుతూ..
దళిత నాయకుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఉదంతాన్ని నెటిజన్లు గుర్తు చేస్తోన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యానించడం వల్లే ఆయన మరణించారని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని మంగ్లిని సూచిస్తోన్నారు. ఈ మధ్య కాలంలో బోనాలు అంటే- తప్ప తాగడం, ఎవడు పడితే వాడు పోతురాజు వేషం వేయడం, బోనాల భక్తి పాటల పేరుతో సరసాలను ప్రోత్సహించేలా పాటలు రాయడం పరిపాటి అయిందని విమర్శిస్తోన్నారు. హైదరాబాద్‌లో గ్రామదేవత అమ్మవారు అంటే భక్తిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications