ప్రేమవివాహం నేరమైంది; నాలుగు ఇళ్ళు దగ్ధమయ్యాయి.. ఆపై అక్కడ పికెటింగ్!!
ప్రేమే నేరమౌనా.. మాపై ఈ పగేలా.. అని గతంలో పాటలు విని వుంటాం. కానీ ఆ పాట తప్పు కాదు. నేటి రోజుల్లోనూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది నేరంగా, క్షమించరాని ఘోరం గా చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరువు హత్యలకు పాల్పడి పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్న తల్లిదండ్రులు ఇంకా మన సమాజంలో లేకపోలేదు.
మేజర్ అయిన అమ్మాయి, మేజర్ అయిన అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే అర్థం చేసుకుని, మంచి చెడులను చర్చించి, మంచి మనసుతో ఆదరించాల్సిన తల్లిదండ్రులు, ఆగ్రహావేశాలకు లోనై దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన రంజిత్, కావ్య శ్రీలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో తాజాగా వీరు ఇంటి నుండి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆపై కుటుంబ సభ్యులకు వీడియో సందేశాన్ని పంపారు.
ప్రేమవివాహం నేరమైంది..నాలుగు ఇళ్ళు దగ్ధమయ్యాయి..!! pic.twitter.com/RueeYjqhda
— oneindiatelugu (@oneindiatelugu) July 5, 2023
తమ ఇష్ట ప్రకారమే ప్రేమ వివాహం చేసుకున్నామని వీడియో ద్వారా వారు కుటుంబ సభ్యులకు తెలిపారు. ముఖ్యంగా యువతి తాను ఇష్టంతోనే రంజిత్ ను పెళ్లి చేసుకున్నానని, తనతో కలిసి బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నందుకు తనను మన్నించాలని కోరింది. తాను సంతోషంగా ఉన్నానని, వారు కూడా సంతోషంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. తమ వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని పేర్కొంది.
అంతేకాదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని కూడా వీడియో సందేశంలో పేర్కొంది. తన కోసం ఎక్కడ వెతకవద్దని, తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే అతనితో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. కుమార్తె వీడియో సందేశం పంపించిన తర్వాత కూడా శాంతించని ఆ యువతి తండ్రి గ్రామంలోని కూతురు వివాహం చేసుకున్న యువకుడి ఇంటితో పాటు అతని మిత్రుల ఇళ్ల ను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు, బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఈ చర్యతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications