మండే ఎండల్లో ప్రజలకు చల్లటి కబురు
ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. బయటకు రావాలంటనే ప్రజలు వణికిపోతున్నారు. భానుడి దెబ్బకు బెంబెలెత్తుతున్నారు. వడగాడ్పులవల్ల చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నడుమ వాతావరణశాఖ చల్లటి కబురు వినిపించింది. తెలంగాణలో ఈనెల ఆరోతేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకరకంగా ప్రజలు మండే ఎండల్లో చల్లటి వార్త అని చెప్పుకోవచ్చు.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురవడానికి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల చెదురు మదురుగా జల్లులు పడుతున్నాయి. ఏపీలో కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన కురుస్తోంది. భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలతోపాటు వేడి గాలులు కూడా తీవ్రంగా పెరిగాయని, మరో మూడు, నాలుగు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది రుతుపవనాలు సరైన సమయానికే ప్రవేశిస్తాయని, వర్షాలు కూడా అధికంగానే కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో బలహీనపడి లానినో ఏర్పడుతోందని, ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఇండియాలో సాధారణంకన్నా అధికంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.












Click it and Unblock the Notifications