అల్ట్రామోడల్.. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్!!
Hafizpet Railway Station: హైదరాబాద్ హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు ఇక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమృత్ భారత్ కింద తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్.. వంటి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. మొదటి విడతలో ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది.
ఇప్పటికే సికింద్రాబాద్, యాదాద్రి, బేగంపేట్ వంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. 718 కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ అభివృద్ధి పనులను చేపట్టారు. మూడు దశల్లో ఇవి పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మితం కానుంది.
ఇప్పుడిదే జాబితాలో హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ చేరింది. 29.21 కోట్ల రూపాయల వ్యయంతో దీని పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 73 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. పనుల పురోగతి గురించి వివరించారు.
12 మీటర్ల వెడల్పుతో స్టేషన్ బిల్డింగ్ ప్రధాన మార్గం రూపుదిద్దుకుంటోంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫామ్ పునర్నిర్మాణం, వాటి విస్తరణ, అదనపు ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అత్యాధునిక వసతులతో విశాలమైన వెయిటింగ్ హాల్, లిఫ్టులు, ఎస్కలేటర్ల ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి గిడ్డర్స్ నిర్మాణం పూర్తయింది.












Click it and Unblock the Notifications