ఆంధ్రా పేరు చెప్పందే బతకలేరా?: కవితకు గాలి ప్రశ్న, ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవితపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఏదో దోచిపెడుతున్నట్టు కవిత మాట్లాడుతున్నారని, ఏపీపై ఆక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి పదవిని దృష్టిలో ఉంచుకునే కవిత ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏపీ లోటు బడ్జెట్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయలేదనే విషయాన్ని ఆమె గుర్తించాలన్నారు. ఆంధ్రా పేరు చెప్పందే బతకలేరా అని ప్రశ్నించారు. ఆనం సోదరుల చేరికపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.

వైసీపీ అధినేత జగన్‌పై కూడా ఆయన మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చేందుకే వైసీపీ పోటీ చేసిందన్నారు. రాష్ట్రంలో ఒకవైపు ప్రజలు వరదలతో అల్లాడుతుంటే, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అసలు ఏ మాత్రం తనకు సంబంధం లేనట్టు వరంగల్‌లో ప్రచారం చేశారన్నారు.
వరంగల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఎనుమాముల మార్కెట్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం 7 హాళ్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు కేంద్ర వద్ద 144 సెక్షన్ విధించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications