గణేశ్ మండపాలు ఏర్పాటు చేయాలంటే ఇవి తప్పనిసరి: సీపీ సజ్జనార్
మరో వారం రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. గణేష్ ఉత్సవాలు అంటే హైదరాబాద్ లో గల్లీ గల్లీకి వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. అయితే గణేష్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ పేర్కొంది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా నిర్వాహకులు వెంటనే అధికారిక పోర్టల్ అయిన policeportal.tspolice.gov.in ను సందర్శించి మండపం, నిర్వాహకుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచనలు చేసింది.
మండపాల ఏర్పాటు స్థలం, విద్యుత్ కనెక్షన్లు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ తదితర పూర్తి వివరాలను ముందుగానే తెలియజేస్తే ఆయా రూట్లలో పటిష్టమైన బందోబస్తు, భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తామని పోలీసులు వెల్లడించారు. నిబంధనలు పాటించకుండా అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే విషయంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

"ఆన్ లైన్ లో గణేష్ మండపాల నమోదు తప్పనిసరి.. గణేష్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. నిర్వాహకులు వెంటనే http://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తుది నిమిషం దాకా వేచిచూడకుండా అధికారిక పోర్టల్ ద్వారా సమాచారం అందించి హైదరాబాద్ సిటీ పోలీస్ కు సహకరించాలి. మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు ముందుగానే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు యంత్రాంగానికి వీలు అవుతుంది" అని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14 సోమవారం రోజున వస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటా 30 నిమిషాల వరకూ విగ్రహ ప్రతిష్టకు శుభ ముహూర్తంగా ఉంది. ఇక నిమజ్జనం తేదీ సెప్టెంబర్ 25 గా ఉంది.












Click it and Unblock the Notifications
