చెల్లని చెక్కులిస్తూ కొనుగోళ్లకు పాల్పడుతున్న ముఠా ఇదే (ఫొటో)
హైదరాబాద్: చెల్లని చెక్కులిస్తూ లక్ష రూపాయల్లోో కొనుగోళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని అయిదుగురు సభ్యులను హైదరాబాదులోని సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12 లక్షల విలువైన 25 ఏసీలు, 100 ఫ్లైవుడ్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠా సభ్యులు ఇచ్చే చెక్కులు రద్దు చేసిన బ్యాంకు ఖాతాలకు సంబంధించినవి కావడం విశేషం.
కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ డా॥ వై.సాయిశేఖర్, బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి సోమవారం మీడియా సమావేశంలో వివరించారు. హైదరాబాదు నగరంలోని ఫతేదర్వాజకు చెందిన షేక్ అబ్దుల్ కరీం(32), బేగంబజార్‌కు చెందిన హితిలేష్ గౌర్(26), మితిలేష్ రాజ్ యాదవ్(28), కిషన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ నజీర్‌ఖాన్(44), శాలింబండకు చెందిన మహ్మద్ ఆసిఫ్(40)లు ముఠాగా ఏర్పడ్డారు.
వారు ఎలక్ట్రానిక్ దుకాణాలు, ఫ్లైవుడ్ దుకాణాల్లో కొనుగోళ్లు చేస్తూ వచ్చారు. మూసాపేట, హెచ్.పి.రోడ్డులోని వినీష్ ప్యానల్స్ దుకాణంలో రూ.1,68,000 విలువ చేసే 100 ఫ్లైవుడ్ షీట్లను కొనేందుకు ఆర్డరు చేశారు. చంపాపేట సమీపంలోని దుర్గానగర్ కాలనీలో ఫ్లైవుడ్ షీట్లు దిగుమతి చేసుకుని, దుకాణదారుడికి రూ.1,38,360, రూ.25,000ల విలువతో రెండు సిండికేట్ బ్యాంకుకు చెందిన చెక్కులను ఇచ్చారు.

ఆ చెక్కులను బ్యాంకుకు పంపితే, మూసివేసిన ఖాతాకు చెందిన చెల్లని చెక్కులని తేలింది. దీంతో వినీష్ ప్యానల్స్ యజమాని గంగరాజు చంద్రశేఖర్‌రాజు ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను ఎర్రగడ్డలో అదుపులోకి తీసుకున్నారు. మోసాలకు పాల్పడిన విషయాన్ని నిందితులు విచారణలో అంగీకరించారు.
ఎస్సార్‌నగర్‌లోని కంఫర్ట్ ఎయిర్‌టెక్ సిస్టమ్స్ దుకాణంలో 10 క్యారియర్ ఏసీలు, కేపీహెచ్‌బీ కాలనీలోని ఎఫ్2జడ్ యునైటెడ్ షాప్‌లో 15 డైకిన్ ఏసీలు, మియాపూర్‌లోని రక్షిత ఎయిర్ కన్డీషనర్స్‌లో 15 ఓల్టాస్ ఏసీలను ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు చేశారు. దుకాణదారులకు చెల్లని చెక్కులను ఇచ్చారు. నిందితుల నుంచి సనత్‌నగర్ పోలీసులు రూ.1,68,000 విలువ చేసే 100 ప్లైవుడ్ షీట్లు, రూ.6,32,000 విలువచేసే 15 డైకిన్ ఏసీలు, రూ.4 లక్షల విలువ చేసే 10 క్యారియర్ ఏసీలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొత్తును స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications