తెలివి మీరారు: ఇలా నోట్ల చెలామణికి ప్లాన్, కటకటాల వెనక్కి...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన పెద్ద నోట్ల నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పెద్దనోట్లు రద్దయి కొత్త ఫీచర్లతో వచ్చిన రూ.500, రూ.2 వేల నోట్లకు అప్‌గ్రేడ్ అయిన విషయం తెలిసిందే. అందుకు తగిన విధంగా నకిలీ నోట్లను చెలామణీ చేసే ఓ అంతర్రాష్ట్ర ముఠా పోలీసుల చేతికి చిక్కింది. 

నోట్ల రద్దుకు ముందు నకిలీ పెద్దనోట్ల దందా చేసే ముఠా ఇప్పుడు రూ.2 వేల నోట్లను చెలామణి చేస్తూ పట్టుబడింది.
డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్) ఇచ్చిన సమాచారంతో ఈ ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్టు డీసీపీ లింబారెడ్డి శుక్రవారం తెలిపారు. కొత్తగా విడుదలైన రూ.2 వేల నోట్లకు నకిలీలను చెలామణి చేస్తూ పట్టుబడిన మొదటి ముఠా ఇదేనని చెప్పారు.

హైదరాబాదులోని యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ గౌస్, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఖహీముల్ హక్ గతంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు చిక్కారు. జైలులో వీరికి చైన్‌స్నాచింగ్ కేసులో అరెస్టయిన ఘట్‌కేసర్‌కు చెందిన అర్షద్ అలీ పరిచయమయ్యాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి నకిలీ నోట్ల దందాను కొనసాగిద్దామని నిర్ణయించుకున్నారు.

Robbers Gang Arrested By a Police in UP And Rs.12 Lakh Recovered | Oneindia Telugu
Gang nabbed in Hyderabad with Fake currency

ఈ ఏడాది జనవరిలో ఖహీముల్ హక్ జైలు నుంచి విడుదలై పశ్చిమబెంగాల్‌కు వెళ్లిపోగా, ఆ తర్వాత షేక్ అర్షద్ విడుదలయ్యాడు. గత నెల 14న గౌస్ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అర్షద్‌ను కలుసుకున్నాడు. తాను ఖహీముల్ హక్‌కు ఫోన్ చేసి చెప్తానని, మహారాష్ట్రలోని నాగపూర్‌కు వెళ్లి రూ. 2 లక్షల నకిలీ నోట్లు తీసుకురావాలని సూచించాడు.

ఈ మేరకు అర్షద్ ఈ నెల 11న నాగాపూర్‌కు వెళ్లాడు. పశ్చిమ బెంగాల్ నుంచి ఖహీముల్ హక్ పంపిన రూ.2 వేల నకిలీ నోట్లను అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి తీసుకురాగా, అర్షద్ అతడిని కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. మరుసటి రోజు గౌస్, అర్షద్, అతడి సోదరుడు ఆరీఫ్ అలీ, పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన రాజాక్ హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో కలుసుకున్నారు.

తొలుత గౌస్ రూ.10 వేలు విలువ చేసే నకిలీ నోట్లను మార్కెట్‌లో చెలామణి చేశాడు. ఎవరూ గుర్తించకపోవడంతో శుక్రవారం మరికొన్ని నోట్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో మార్పిడి చేసేందుకు అర్షద్ అలీ, ఆరీఫ్ అలీ, రజాక్ ప్రణాళిక రూపొందించారు.

నకిలీ నోట్ల ముఠా తిరుగుతున్నదని డీఆర్‌ఐ ఇచ్చిన సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు బృందం తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.90 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన సూత్రధారులైన మహ్మద్ గౌస్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఖహీముల్ హక్ పరారీలో ఉన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో ముద్రించిన నకిలీ నోట్లు పశ్చిమబెంగాల్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం గోపాలపురం పోలీసులకు అప్పగించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gang with fake currency has been nabbed by Hyderabad police. This gang is exchanging fake currency of new notes
Please Wait while comments are loading...