500రూపాయలకు గ్యాస్ సిలిండర్లు వారికే.. మిడిల్ క్లాస్ వారికి షాకిచ్చిన రేవంత్ సర్కార్!!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తుందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ బాదుడు నుండి ఉపశమనం కలిగిస్తుందని భావిస్తే, అందుకు భిన్నంగా 500 రూపాయలకే వంట గ్యాస్ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మెలిక ఆందోళన కలిగిస్తుంది. దారిద్రరేఖకు దిగువన ఉన్న, తెల్లరేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ వర్తించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మధ్య తరగతి ప్రజలను హతాశులను చేసింది.

గత ప్రభుత్వ హయాంలో చాలామంది రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడ్డారు. రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నా గత ప్రభుత్వం తూతూ మంత్రంగా రేషన్ కార్డుల మంజూరు చేయడంతో రేషన్ కార్డులు లేని సామాన్య కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు వీరందరికీ రేషన్ కార్డుల టెన్షన్ పట్టుకుంది.
తమకు రేషన్ కార్డులు లేకుంటే మహాలక్ష్మి పథకంలోని గ్యారంటీలు రావని సామాన్య, మధ్య తరగతి ప్రజలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన ప్రజా పాలనలో గ్యారంటీ పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సబ్సిడీ వంటగ్యాస్ పై ఆశలు చిగురిస్తున్నప్పటికీ, రేషన్ కార్డు లింక్ చెయ్యటంతో ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితికి చేరుకున్నారు సామాన్య, మధ్యతరగతి ప్రజలు.
దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికే కాదు, మధ్యతరగతి ప్రజలకు కూడా గ్యాస్ బండ బాదుడు నుండి ఉపశమనం కలిగించాలని, సబ్సిడీ వంట గ్యాస్ అందించాలని మధ్యతరగతి కుటుంబాల మహిళలు అభ్యర్థిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని తమకు కూడా గ్యాస్ 500రూపాయలకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications