సిమాంధ్ర టిడిపితో అంటకాగుతోంది, బాబుకు వంత: గట్టు
హైదరాబాద్: సభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసు రైతులకు అండగా ఉండాల్సింది పోయి సీమాంధ్ర పార్టీ తెలుగుదేశంతో అంటగాగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు గట్టు రామచందర్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వాన పనిచేస్తున్నట్టు ఆయన ఎజెండాకు వంతపాడుతోందని గట్టు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధికార దాహంతో మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేమనే రీతిలో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. నీటిలో నుంచి బయట పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నాయని విమర్శించారు. ఇక్కడ రైతు సమస్యలపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు ఏపీలో రైతు ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీలు లేవా? అని నిలదీశారు. అక్కడో సూత్రం ఇక్కడో సూత్రమా అని మండిపడ్డారు. టీడీపీ దొంగపార్టీ అంటోన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఇవాళ ఆ పార్టీ జెండా, ఎజెండాను ఫాలో అవుతుందని అన్నారు. వీళ్లందరూ దొంగలు అంటోన్న కాంగ్రెస్ పార్టీ వీళ్లతోనే కలిసి పోతోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు విచిత్రంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇదొక విచిత్ర కూటమీని తలపిస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలది కేవలం అధికార దాహం మాత్రమేనని అన్నారు. దేశంలో ఎక్కడా ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయలేదన్నారు. మీరు పరిపాలించిన సమయంలో ఒక్కసారైనా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసిన దాఖలాలున్నాయా? అని నిలదీశారు.
కాకపోతే కేంద్ర ప్రభుత్వం దేవీలాల్ ప్రధానిగా ఉన్నపుడు చేసిందని గుర్తు చేశారు. కానీ రాష్ర్టాలు చేయలేదని వివరించారు. ప్రతిపక్షాల తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారని హెచ్చరించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని సర్వ నాశనం చేసిందే టీడీపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు.
రైతు సమస్యలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు ఎప్పుడు సభ నుంచి బయటపడదామా? అని ప్రతిపక్షాలు వేచి చూశాయని, అందుకు సభను అడ్డుకుని సస్పెన్షన్‌కు గురయ్యారని అన్నారు.
విద్యుత్ కోసం ఉద్యమిస్తే నగరం నడిబొడ్డున బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన చరిత్ర ఆ పార్టీది అని మండిపడ్డారు. రైతులను కాల్చి చంపిన తర్వాత కనీసం అక్కడ స్థూపం కట్టుకుంటామంటే అనుమతించిన నీచ చరిత్ర టీడీపీది అని ధ్వజమెత్తారు. రైతులను జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబుకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications