ఉద్యోగులకు దసరా గిఫ్ట్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్లు !!
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ఉద్యోగులకు సంచలన శుభవార్తను ప్రకటించింది. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరికి వర్తించే విధంగా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ప్రీమియం భారం లేకుండా రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకూ ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించనుంది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ముఖ్యంగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రీసెంట్‌గా వినాయక నిమజ్జనంలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక ప్రమాదవశాత్తు మరణించిన ఘటన మున్సిపల్ సిబ్బందిని కలచివేసింది. ఈ సంఘటన తర్వాత విధి నిర్వహణలో ప్రమాదాలకు గురయ్యే సిబ్బందిని రక్షించాలనే ఆవశ్యకత మరింత స్పష్టమైంది.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ పథకానికి నేరుగా ఆధ్వర్యం వహించారు. సింగరేణి సంస్థ తమ కార్మికులకు అందిస్తున్న బీమా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని.. ఈ సౌకర్యాన్ని జీహెచ్ఎంసీ కూడా అనుసరించింది. పండుగ నేపధ్యంలో ఈ ప్రకటన ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని చేకూరుస్తుంది. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బీమా సౌకర్య వివరాలు..
- నెలవారీ వేతనం రూ.25,000 వరకు: రూ.30 లక్షల బీమా
- నెలవారీ వేతనం రూ.25,001-75,000: రూ.50 లక్షల బీమా
- నెలవారీ వేతనం రూ.75,001-1.50 లక్షలు: రూ.1 కోటి బీమా
- నెలవారీ వేతనం 1.50 లక్షలకు పైగా: రూ.1.25 కోట్ల బీమా
అదనపు ప్రయోజనాలు..
శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే బీమా మొత్తంలో 50శాతం పరిహారం అందించబడుతుంది.
విమాన ప్రమాదంలో మరణం జరిగినట్లయితే బీమా మొత్తం రెట్టింపు అవుతుంది.
ఈ పథకం ఉద్యోగుల భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది.












Click it and Unblock the Notifications