అనుమానాస్పద స్థితిలో ‘నవోదయ’ విద్యార్థిని మృతి

Subscribe to Oneindia Telugu

వరంగల్: వరంగల్‌ అర్బన్‌ జిల్లా మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జయశంకర్‌ పట్టణం హనుమాన్‌నగర్‌ కాలనీకి చెందిన వెంకన్న-స్వాతిల రెండో కుమార్తె శేశాల సుచిత(14) స్థానిక నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఆదివారం సాయంత్రం బాత్‌రూంలోకి వెళ్లి తిరిగి రాలేదు. స్నేహితులు వెళ్లి చూడగా అప్పటికే చున్నీతో ఉరి వేసుకొని ఉంది. వెంటనే విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేశారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పడాల సత్యనారాయణ, సిబ్బంది వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశం పొందిన సుచిత అప్పటి నుంచి ఇక్కడే చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో విద్యార్తులను కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు సుచిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు. కొద్ది గంటల్లోనే ఈ ఘటన వెలుగచూసింది. ఈ విషయంపై మామునూరు సీఐ శివరామయ్య మాట్లాడుతూ.. ఆత్మహత్యకు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

suchi

ఏసీపీ శోభన్‌కుమార్‌, సీఐ ఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బంది, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడారు. విషయం తెలిసి నవోదయ విద్యాలయాల అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎంజీఎం మార్చురీ వద్దకు చేరుకొని అక్కడే ఉన్న ప్రిన్సిపల్‌ సత్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటిసారి నవోదయ విద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య ఘటన చోటుచేసుకోవడంతో సిబ్బంది, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

డబ్బుల కోసం తల్లిని హత్య చేశాడు

నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లినే కొడుకు కడతేర్చాడు. తోబుట్టువుకు ఆర్థిక సాయం చేస్తుందనే అక్కసుతో కిరాతకంగా హతమార్చాడు. ఈ హృదయ విదారక ఘటన కమలాపూర్‌ మండలం వంగపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వంగపల్లికి చెందిన ఓదెమ్మ(58)పై ఆమె కొడుకు నిగ్గుల శంకర్‌ కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన ప్రకారం.. వంగపల్లి గ్రామానికి చెందిన నిగ్గుల ఓదెమ్మ- రాజమల్లు దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు సుకన్య ఇటీవల కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురుకు ఆర్థిక సాయం చేయాలనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారని భావించిన శంకర్‌ వారితో పలుమార్లు గొడవకు దిగాడు.

పది రోజుల క్రితం తల్లిదండ్రులతో గొడవపడిన శంకర్‌ ఇంట్లో బీరువాలో దాచిన నగలు, నగదు, బ్యాంకు పాసు పుస్తకాలు తీసుకెళ్లాడు. ఈ విషయమై తల్లిదండ్రులు మార్చి 19న శంకర్‌ను గ్రామ పెద్దల వద్దకు పిలిపించి మందలించారు. తనను పెద్ద మనుషుల వద్దకు పిలిపిస్తావా? అని కోపంతో ఇంటికి వెళ్లిన శంకర్‌ ఇంట్లో వంట చేస్తున్న తల్లిపై కర్రతో బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఓదెమ్మను 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త రాజమల్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగబాబు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎల్కతుర్తి సీఐ కె.సతీష్‌చందర్‌రావు పరిశీలించి విచారణ చేపట్టారు.

హన్‌మాన్‌నగర్‌కాలనీలో విషాదం

విద్యార్థిని మృతితో స్వస్థలం భూపాలపల్లి పట్టణం హన్‌మాన్‌నగర్‌కాలనీలో విషాదం నెలకొంది. మాజీ ఎంపీపీ శేశాల స్వాతి-వెంకన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. చిన్న కుమార్తె సుచిత 6వ తరగతి నుంచే నవోదయ విద్యాలయంలో చదువుకుంటుంది. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేదని స్థానికులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నవోదయ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని మామూనూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతురాలు కుటుంబసభ్యులు తెలిపారు.

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లు వేర్వేరు కారణాలతో ఆదివారం మృతి చెందారు. కాజీపేట ట్రాఫిక్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జన్ను ప్రసాద్‌ ఉదయం విధులకు హాజరుకావడానికి శంభునిపేట నుంచి కాజీపేటకు వస్తుండగా హంటర్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్డడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన 1989లో పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు.

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాలలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. మరో ఘటనలో జులైవాడలో నివాసముంటున్న కానిస్టేబుల్‌ అనిల్‌ మార్చి 19న కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు.

అనిల్‌ 2009లో పోలీసుశాఖలో ఉద్యోగంలో చేరారు. భూపాలపల్లిలో స్పెషల్‌ పార్టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు కొన్ని రోజుల కిత్రం వివాహమైంది. పోలీసుశాఖలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది మృతి చెందడంతో తోటి మిత్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఇద్దరిది ఒకే గ్రామం..
అనిల్‌, జన్ను ప్రసాద్‌ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరిద్దరిది వర్ధన్నపేట కావడం విశేషం. ఒకే రోజు గ్రామానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించడంతో బంధువులు, స్నేహితులు దుఖఃసముద్రంలో మునిగిపోయారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

అనారోగ్యంతో బాధపడుతున్న భూక్యా దామా(60) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. మృతుడి భార్య, ప్రయాణికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన భూక్యా దామా(60) అతని భార్య కాంతమ్మలు, మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని ఒక దేవాలయానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో పయనమయ్యారు.

ఇల్లందు, మహబూబాబాద్‌ ఆర్డినరీ బస్సులో ప్రయాణిస్తుండగా బయ్యారం మండలంలోని సత్యనారాయణపురం బస్‌స్టాప్‌ వద్దకు రాగానే కాంతమ్మ తన భర్త దామాతో కలిసి బస్సు దిగే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా దామా స్పృహ కోల్పోయి బస్సులోనే కుప్పకూలాడు. దీంతో బస్సుడ్రైవర్‌, కండక్టర్లు వారిని బయ్యారం దాకా తీసుకొచ్చి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు చెప్పారు. కళ్లముందే భర్త మృతిచెందడంతో భార్య కాంతమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl student allegedly died in Navodaya school in Warangal district.
Please Wait while comments are loading...