ఇంట్లో పట్టపగలు అమ్మాయిపై నలుగురు రేప్: ఆపై హత్య, ఆత్మహత్యగా చిత్రీకరణ
వరంగల్: వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా వున్న కృష్ణవేణి(17) అనే బాలికను పట్టపగలే నలుగురు యువకులు అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశారు. బుధవారం ఇంట్లో కృష్ణవేణి శవమై కనిపించింది.
అయితే ఆమెది తొలుత ఆత్మహత్యగా భావించారు. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోలీసులు నిర్భయ, పోస్కో చట్టాలతో పాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
వివరాలు ఈ విధంగా ఉన్నాయి - నల్గొండ జిల్లా సంస్థాన నారాయణపూర్ మండలం కొత్లాపురానికి చెందిన ఎరిగదిండ్ల వెంకటేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేశ్ భార్య గతంలో చని పోగా, పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. కుమారుడు కొత్లాపురంలోనే ఉంటున్నాడు. ఆయన మాత్రం చిన్న కూతురు కృష్ణవేణి(17)తో కలిసి నర్సక్కపల్లిలో నివసిస్తున్నాడు.

అయితే, గుండెజబ్బుతో బాధపడుతున్న వెంకటేశ్ బుధవారం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. దీంతో కృష్ణవేణి ఒంటరిగా ఇంట్లో ఉన్న విష యం గమనించిన నర్సక్కపల్లి యువకుడు వేముల రాజు తన స్నేహితులు కందికొండ కార్తీక్, బండి శ్రావణ్, గట్టు సాయిలు కలిసి బాలిక ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎక్కడ బయటపడుతుందోనని గొంతు నులిమి ఆమెను హత్య చేశారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించారు. కృష్ణవేణి కిరోసిన పోసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశారు. మొదట దాన్ని ఆత్మహత్యగానే భావించారు. పోలీసులు అనుమానంతో ఆకతాయిగా పేరున్న రాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో జరిగిన దారుణం బయటపడింది. తాను, తన స్నేహితులు కార్తీక్, శ్రావణ్, సాయి కలిసి కృష్ణవేణిపై అత్యాచారం చేసిన చంపినట్టు అతడు విచారణలో వెల్లడించాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!