పేదలకు గుడ్ న్యూస్.. ఆ ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య చికిత్సలు పూర్తిగా ఉచితం!
నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరొక శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద రోగుల కోసం హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులకు సంబంధించి మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు.
నిమ్స్ తరహాలో హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రులు
హైదరాబాద్లోని నిమ్స్ తరహాలో టీమ్స్ లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించిన ఆయన రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు అత్యధిక మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. దేశంలోనే అగ్రగామిగా ఉన్న నిమ్స్ ఆసుపత్రి తరహాలోనే కొత్త ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా టిమ్స్
ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా అత్యుత్తమ వైద్య సేవలకు కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పైన, రోగులకు అందిస్తున్న సేవలు పైన సమగ్ర అధ్యయనం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
హైదరాబాద్ లో మూడు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం
ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించి అదే తరహాలో టీమ్స్ ను అభివృద్ధి చేసి, నిరుపేదలకు సైతం మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. టిమ్స్ ఆసుపత్రులను సాధారణ ప్రభుత్వ ఆసుపత్రులుగా కాకుండా, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా మార్చాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న 3 టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం పైన సమీక్షలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించే టిమ్స్
ఆల్వాల్ టిమ్స్ న్యూరో సైన్సెస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా, సనత్ నగర్ టిమ్స్ కార్డియాక్ సైన్సెస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా, కొత్తపేట టిమ్స్ గ్యాస్ట్రో సైన్సెస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నిర్మిస్తున్నారు. ఈ టిమ్స్ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి, ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేయనున్నారు. ఇదే క్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్ తరహాలో టిమ్స్ నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications