వారికి కేంద్రం శుభవార్త.. ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకునేలా మీ డబ్బు - మీ హక్కు!
భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు బ్యాంకులు, షేర్లు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, తదితర వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడతారు. అయితే కొన్నిసార్లు ఆయా ఖాతాలు నిర్వహణ లేకుండా పక్కన పడిపోతున్నాయి. ఖాతాదారులు, మరణించిన వారసులకు తెలియక, అవగాహన లేకపోవడంతో క్లెయిమ్ కూడా చేసుకోకుండా పోతున్నాయి. అయితే అటువంటి ఖాతాల కోసం, డబ్బులను విత్ డ్రా చేసుకోవడం కోసం కేంద్రం తాజాగా ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది.
క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తులు పొందే మీ డబ్బు మీ హక్కు
నిర్వహణ లేని ఖాతాలోని నిధులను తిరిగి తీసుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది. పదేళ్లకు పైగా నిష్క్రియగా ఉన్న ఖాతాలోని నగదును తిరిగి పొందేందుకు అవకాశం కల్పించింది. క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'మీ డబ్బు - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.

10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు తీసుకునే అవకాశం
ఈ శిబిరాలు ప్రతి జిల్లాలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతాయి..బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు వంటి క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను యాజమానులు సులభంగా పొందేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు ఉన్న వారు ఆర్‌బీఐ ఉద్గం వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకుని శిబిరానికి హాజరుకావాలని సూచిస్తున్నారు.
అన్ని జిల్లాలలోనూ మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తగిన పత్రాలతో పాల్గొనాలని కలెక్టర్లు కోరుతున్నారు.నిర్వహణ లేని ఖాతాల వివరాలను సంబంధిత బ్యాంకుల వెబ్‌సైట్‌లలో లేదా ఆర్‌బీఐ యూడీజీఏఎం (UDGAM) పోర్టల్ https://udgam.rbi.org.in లో చూడవచ్చు. అయితే ఖాతాలను క్లెయిమ్ చేయని వారు ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలతో కేవైసీ పూర్తిచేసి సమాచారం పొందాలి.
ఖాతాదారులు, వారసులకు ఆ డబ్బులు అందించడమే 'మీ డబ్బు..మీ హక్కు' లక్ష్యం
బీమా, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు ఆయా సంస్థల వెబ్‌సైట్‌లను సంప్రదించాలి అని సూచిస్తున్నారు. నిర్వహణ లేని నిధులను తిరిగి ఖాతాదారులు, వారసులకు అందించడమే ఆర్‌బీఐ 'మీ డబ్బు..మీ హక్కు' లక్ష్యం అని కేంద్రం చెబుతోంది. ఈ నెల 23న కలెక్టరేట్‌లో జరిగే అవగాహన శిబిరంలో క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా మొత్తాలున్న వారికి సహాయపడతామని లీడ్ బ్యాంకు మేనేజర్లు కూడా చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడో మరిచిపోయిన ఖాతాలోని డబ్బులను ఇప్పుడు క్యాష్ చేసుకోండి.












Click it and Unblock the Notifications