రైతు భరోసాపై శుభవార్త.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!
తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మరో 10- 15 రోజుల్లో ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. రైతు భరోసా ఇప్పుడు ఇస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరినట్టు అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడినట్టు అవుతుంది.
రైతు భరోసా నిధుల సమీకరణ పై ప్రభుత్వం కసరత్తు
రైతు భరోసా పంపిణీని త్వరలోనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రైతుల ఖాతాలలో వానాకాలం రైతు భరోసాను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది .ఈ క్రమంలోనే నిధుల సమీకరణ పైన దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నుంచి 3 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్ల రూపాయలకు తాజాగా ఇండెంట్ పెట్టినట్టు తెలుస్తోంది.
రైతు భరోసాగా రైతు బంధు పథకం పేరు
ఈ నిధులన్నీ సమకూరిన తర్వాత రైతులకు వానకాలం పెట్టుబడి సహాయాన్ని అందించి ఆ తర్వాత స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకం కింద ఎకరానికి 5000రూపాయలు చొప్పున పంపిణీ చేయగా, ప్రతి సీజన్లోనూ రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం కోసం 7500కోట్ల రూపాయలు అవసరం అయ్యేవి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024 - 2025 సీజన్లో రైతుబంధు పథకం పేరును రైతుభరోసాగా మార్చింది.

యాసంగిలో ఈ రైతులకే పెట్టుబడి సాయం
2023- 2024 యాసంగి సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు 7625 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. రైతుబంధును ప్రక్షాళన చేసేందుకు కొంత సమయం పడుతుందని ఇప్పటివరకు వానకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు. ఇక మొన్న యాసంగి సీజన్లో 57 లక్షల మంది 84 లక్షల ఎకరాలకు 5058 కోట్ల రూపాయలను మాత్రమే పంపిణీ చేసింది. నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది.
వానాకాలం ఎవరికి రైతు భరోసా అందుతుంది
ఇక ప్రస్తుతం వానకాలం సీజన్లో రైతు భరోసా ఎవరికి ఇవ్వబోతున్నారు? చిన్న సన్న కారు రైతులకే రైతు భరోసా పరిమితం చేస్తారా లేదా పెద్ద రైతులకు కూడా రైతు భరోసా ఇస్తారా? అన్నది రైతు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిధుల సమీకరణలో బిజీగా ఉంది తెలంగాణా సర్కార్. నిధులను సమీకరించిన తర్వాత రైతు భరోసా ను అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రైతు భరోసా ఇచ్చే ప్లాన్
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం త్వరలోనే ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో ఈలోపే రైతాంగానికి మేలు చేకూర్చే ఈ కీలక పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోగానే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసి ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications