అమిత్ షాతో భేటీ అయిన గోపీచంద్
భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. తర్వాత ఆయన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గోపీచంద్ ఎటువంటి రాజకీయ అంశాలను చర్చించలేదని, క్రీడారంగ అభివృద్ధిపై చర్చ జరిగినట్లు తెలిపారు.
కొద్దిరోజుల క్రితమే అమిత్ షా ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. తర్వాత పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా యువ కథానాయకుడు నితిన్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే నిఖిల్‌ను కూడా కలుస్తారంటూ వార్తలు వస్తున్నాయి. వీరే కాకుండా వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులుగా నిలిచినవారందరినీ బీజేపీ పెద్దలు కలవబోతున్నారు.

దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ఇతర రాష్ట్రాల్లో ఉనికి నామమాత్రంగానే ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న తెలంగాణపై ఆ పార్టీ ఆశలు పెంచుకుంది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటే ఏపీపై సులువుగా దృష్టిపెట్టవచ్చని తెలుస్తోంది. అలాగే తమిళనాడు, కేరళలో కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆ పార్టీ పెద్దలు కలుస్తున్నారు. రానున్న కాలంలోను ఈ భేటీలు కొనసాగే అవకాశం కనపడుతోంది. వీరిలో ఎవరైనా కేంద్ర నాయకత్వంపై సానుకూల వైఖరి కనపరిచేవారుంటే వారిని పార్టీ తరఫున ప్రచారానికి వినియోగించుకునే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications