హరీశ్ రావుతో ఎమ్మెల్యే రాజా సింగ్ భేటీ: పార్టీ మార్పుపై తేల్చేశారు
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భేటీ అయ్యారు. గత కొంత కాలం క్రితం భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజా సింగ్.. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజా సింగ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే, ఈ ప్రచారాన్ని రాజా సింగ్ కొట్టిపారేశారు. తాను తన నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిస్కారం కోసమే మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసినట్లు ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే మంత్రిని కలిశానని స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మాణం గురించి హరీశ్ రావుతో చర్చించినట్లు రాజా సింగ్ తెలిపారు.

మంత్రి హరీశ్ రావుతో భేటీ తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిందని.. దీంతో ఏమాత్రం నిజం లేదన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినా.. ఎత్తివేయకపోయినా తాను బీజేపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. బీజేపీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.
తాను బీజేపీని వదిలి ఏ పార్టీలోకి వెళ్లనని.. ధూల్‌పేట ఆస్పత్రి ఆధునికీకరణపై మాట్లాడేందుకే మంత్రి హరీశ్ రావును కలిసినట్లు తెలిపారు. ఆయన పిలిస్తేనే వెళ్లి ఆస్పత్రి సమస్యలు వివరించానని చెప్పారు. కాగా, ఒక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ నుంచి రాజా సింగ్‌ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాజా సింగ్ కొద్ది వారాలపాటు జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications