శవాలకు కూడా పరీక్షలు, చికిత్స: ప్రైవేట్ ఆస్పత్రులపై గవర్నర్ నిప్పులు
హైదరాబాద్: కార్పోరేట్, ప్రైవేట్ ఆస్పత్రులపై గవర్నర్ నరసింహన్ నిప్పులు చెరిగారు. చివరకు డెడ్ బాడీలకు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటైన 13వ అఖిల భారత క్యాన్సర్ కేర్ సదస్సులో ఆయన శనివారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు. ఫీజుల రూపంలో రోగులను ఆస్పత్రులు పట్టి పీడిస్తున్నాయని ఆగ్రహించారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు ఎందుకు వెళ్లరని ఆయన అడిగారు.

రోగులకు ప్రేమను కూడా పంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆయన అన్నారు. వైద్య రంగంలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. విధి నిర్వహణలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన అన్నారు.
షుగర్ టెస్టుకు వెళితే 28 టెస్టులు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ ఆస్పత్రులు వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications