మహిళల కోసమే - చూస్తూ ఉండలేను : బలమైన శక్తిగా ఉంటా - గవర్నర్ తమిళిసై ..!!
ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొంటే చూడలేనని చెప్పారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రజా సమస్యలు పరిష్కరించడానికే రాజ్ భవన్ ఉందని స్పష్టం చేసారు. మహిళలు బయటకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని.. వారు తమ సమస్యలు చెప్పుకోవడానే రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ ఏర్పాటు చేశానని తెలిపారు. మహిళలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆడవాళ్లను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడు బలమైన శక్తిగా ఉంటానన్నారు.
మహిళ బాధపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో తాను రోగులను పరామర్శించిన అంశాన్ని గవర్నర్ గుర్తు చేసారు. రాజ్ భవన్ ప్రభుత్వ కార్యాలయమని చెబుతూ..ఉన్నది ప్రజల కోసమేనని స్పష్టం చేసారు. ప్రజల సమస్యలను వినటం.. పరిష్కరించటం తమ బాధ్యత అన్నారు. సమాజంలో మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. చాలా మంది వేధింపుల గురించి ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక..వేధింపులు తట్టుకోలేక వారిలో వారే కుమిలిపోతున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ మహిళలకు తానున్నాని చెప్పటం కోసమే ఈ మహిళా దర్భార్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గవర్నర్ చెప్పుకొచ్చారు.

బాధిత మహిళలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు ఎదురు చెప్పేవాళ్లను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. మహిళల శ్రేయస్సు కోసం తన పని కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసారు. దర్బార్ నిర్వహణ లో ఎటువంటి రాజకీయం లేదని చెప్పారు. రాజ్ భవన్ ను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. తన వద్దకు వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి పంపుతానని ..స్పందించాలని కోరారు. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం విషయంలో తాను నివేదిక కోరానని..ఇంకా అందలేదని చెప్పుకొచ్చారు. మహిళా దర్బార్ ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని గవర్నర్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications