కొత్త రేషన్ కార్డులు సిద్దం, ఎలక్ట్రానిక్ చిప్‌తో - దక్కేది వీరికే..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల పైన ప్రభుత్వం తమ నిర్ణయం వెల్లడించింది. సంక్రాంతి తరువాత కొత్త కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అర్హతల ఖరారు పైన తుది కసరత్తు జరుగుతోంది. రేషన్ కార్డుల్లో వినూత్నంగా ఎలక్ట్రానిక్ చిప్స్ తో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి.. కొత్త కార్డులను మంజూరు చేయనుంది.
ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు పై కసరత్తు వేగవంతం చేసింది. అత్యాధునిక సాంకేతికతో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హాయంలో రెండున్నారేళ్ల క్రితం అప్పుడు దరఖాస్తులను ఆహ్వానించి లబ్దిదారులకు నాటి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఆ తరువాత తిరిగి అర్హత ఉన్న వారు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నా.. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డులు మంజూరుకు నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల ఖరారు పైన కీలక నిర్ణయం తీసుకుంది.

ఎలక్ట్రానిక్ చిప్
రాష్ట్ర ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను ఏకీకృతం చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కార్డులు జారీ చేస్తోంది. రేషన్ కార్డుల కోసం దాదాపు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రభుత్వం ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్తగా జారీ చేసే రేషన్ కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆ చిప్‌లో కార్డుదారుడి కుటుంబ సభ్యుల సంఖ్య తో పాటుగా చిరునామా తదితర సమాచారం ఉండనుంది. అధికంగా గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో ప్రస్తుతం సుమారు 17.21 లక్షల కార్డులు ఉన్నట్లు అధికారుల సమాచారం.
మార్గదర్శకాలు
సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసారు. కొత్తగా దాదాపు 36 లక్షల మందికి రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ సూచనలను పరిగణలోకి తీసు కుంటున్నారు. ప్రస్తుతం లబ్దిదారులకు అందిస్తున్న ఆరు కిలోల బియ్యంతోపాటు సన్నబియ్యం కూడా అందించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు లోగా కొత్త కార్డుల అర్హతలు.. మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండటంతో.. కార్డుల మంజూరులో ప్రభుత్వం ఫిర్యాదులకు అవకాశం లేకుండా వ్యవహరించాలని డిసైడ్ అయింది.












Click it and Unblock the Notifications