అందరికీ ఉద్యోగాలివ్వలేమన్న ఈటల: మరోసారి విపక్షాలను ఆడిపోసుకున్న సర్కార్

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇస్తుందని ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురు చూసిన నిరుద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. 'తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌ లైన్‌ నిధులు, నీళ్లు, నియామకాలు'. అందులో అత్యంత కీలక ఉద్యోగ నియామకాలపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చపై సీఎం కేసీఆర్ జవాబు చెప్తారని, తమకు భరోసా ఇస్తారని ఆశించిన నిరుద్యోగులకు ఆశాభంగమైంది.

మూడున్నరేళ్లుగా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.? అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, రాష్ట్రం ఏర్పడగానే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఇప్పటి వరకూ ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించాయి. ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ప్రశ్నించడంతో మంత్రులు కూడా ఎదురుదాడికి దిగారు. గత విషయాలే మరోసారి సభ ముందు వల్లె వేశారు.

గత అసెంబ్లీలో ప్రకటించిన వివరాలే వల్లె వేసిన మంత్రులు

గత అసెంబ్లీలో ప్రకటించిన వివరాలే వల్లె వేసిన మంత్రులు

చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు ఇవ్వలేమని, ఉద్యోగాల భర్తీపై గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ఈటల రాజేందర్‌ చెప్పారు. 20 నెలల్లో 63 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన విషయాన్ని మరోసారి మంత్రులు పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంత మంది రిటైర్‌మెంట్‌ అవుతున్నారు. మొత్తం ఖాళీలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారు. ఉద్యోగ క్యాలెండర్‌ ఎప్పుడు విడుదల చేస్తారని విపక్ష పార్టీలు నిలదీశాయి.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై నిలదీసిన విపక్షాలు

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై నిలదీసిన విపక్షాలు

విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి అవలంభించింది. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేసి ఆ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామన్న హామీ ఏమైందని విపక్షాలు నిలదీశాయి. వేతనాలు భారీగా పెంచామని మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ దాటవేత ధోరణిని అనుసరించారు. కోర్టు కేసుల పేరుతో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పారు తప్ప, కోర్టు కేసులు వీగి పోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో స్పష్టత ఇవ్వలేదు. సెర్ఫ్‌ ఉద్యోగుల డిమాండ్లపైనా మాట్లాడలేదు. ప్రతిపక్షాలన్నీ 16 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేశారని చెప్పగా, ఈ మూడేళ్లలో 27,744 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు పేర్కొన్నారు.

తప్పుబట్టిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

తప్పుబట్టిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

నిరుద్యోగ యువకులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఓట్ల కోసం అనేక అవాస్తవాలు చెబుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. కాగా కీలక నిరుద్యోగ అంశంపై జరుగుతున్న చర్చకు సీఎం కేసీఆర్ గైర్హాజరవ్వటంపై సర్వత్రా చర్చగా మారింది. ఉద్యోగాల భర్తీపై సర్కార్ స్పందించిన తీరుకు నిరసనగా విపక్షాలు శాసనసభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మండిపడ్డాయి. విపక్షాల వాకౌట్‌ తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చంద్రబాబు రాసిన 'మనసులోని మాట' వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు శాశ్వత ఉద్యోగ నియామకాలకు వ్యతిరేకమని వ్యాఖ్యానించడంతో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా చంద్రబాబు ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. తన మనసులోని మాటను హరీశ్‌రావు చెప్పుకున్నట్టు ఉందని సండ్ర వెంకట వీరయ్య ఎద్దేవా చేశారు. 31 జిల్లాల్లో కలెక్టర్లు తప్ప సిబ్బంది లేరని, రెవెన్యూ డివిజన్లలో సబ్‌కలెక్టర్లను నియమించి, మిగతా సిబ్బందిని నియమించకుండా పనులు చేయమంటే ఎలా అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏలలో ఇప్పటికీ పీవోలను నియమించలేదని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లు లేరన్నారు. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణకు కోచ్‌గా వ్యవహరించిన పీఈటీ గర్భవతిగా ఉండి అనారోగ్యం పాలై చనిపోయిందని, ఇప్పటి వరకు ఆమె కుటుంబాన్నిపట్టించుకోలేదని అన్నారు. 2008 డిఎస్సీ అభ్యర్థులు చెప్పులు అరిగెలా మంత్రివద్దకు, సీఎం వద్దకు తిరిగినా స్పందించడం లేదన్నారు.

1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థుల భవితవ్యమేమిటో చెప్పాలని విపక్షాల డిమాండ్

1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థుల భవితవ్యమేమిటో చెప్పాలని విపక్షాల డిమాండ్

ఉద్యోగ కాల్యెండర్‌ ఎప్పటిలోగా విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశాయి. ఎస్సీ, ఎస్టీ బ్యాంక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై సీపీఐ(ఎం) సభ్యుడు సున్నం రాజయ్య ప్రశ్నించారు. ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ సభ్యుడు కె లక్ష్మణ్‌ అడిగారు. ఉద్యోగ పాలసీ ప్రభుత్వం వద్ద ఏమైనా ఉందా అని నిలదీశారు. 1998 క్యాలీఫై డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇస్తారా? లేదా? అని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఎంపిక చేసిన ఉద్యోగ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కానీ మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ‘కేసులతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్నారు. ఇలాంటి అన్ని రకాల అవరోధాలను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొని ఉద్యోగాలు భర్తీ చేస్తాం' అని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇప్పటికీ 1400 మంది ఉద్యోగుల విభజన అంశం తేలలేదని అన్నారు. ఉద్యోగాల నియామకంపై 272 కేసులు ఉన్నా, టీఎస్‌పీఎస్సీ వివిధ శాఖలలో ఉద్యోగ నియామకాల కోసం 73 నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. టీఎస్‌పీఎస్సీని చూసి గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు అబ్బుర పడుతున్నాయని సెలవిచ్చారు.

రెండు శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలివ్వలేమని వ్యాఖ్య

రెండు శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలివ్వలేమని వ్యాఖ్య

తెలంగాణలో 4,41,995 ఉద్యోగాలు ఉంటే.. 1,08,132 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టీఎస్‌పిఎస్‌సి ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7,266, విద్యుత్‌ శాఖలో 1,427, పోలీసు శాఖలో 12,157 పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు. అన్ని సమస్యలను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. రెండు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలుండవని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఉద్యోగ నియామకాలు సజావుగా సాగితే ప్రభుత్వం ఎందుకు భయ పడుతున్నదో అర్థం కావడం లేదు. గతేడాది ఉద్యోగ నియామకాల కోసం ఆందోళన చేపడతామని అర్జీ పెట్టుకుంటే మావోయిస్టులు వస్తారని, శాంతిభద్రతల పరిరక్షణ సమస్యగా పరిణమిస్తుందని సెలవిచ్చారు. అంతకుమించి జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఇంటిపై పోలీసుల దాడిని ఏ కోణంలో చూడాలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు చెప్పి ఉంటే బాగుండేదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా స్ఫూర్తియాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన కోదండరాంను అడుగడుగునా పోలీసు నిర్బంధంతో అడ్డుకున్న కేసీఆర్ సర్కార్.. తాజాగా కొలువుల కొట్లాట సభ నిర్వహణకు అనుమతి నిరాకరించింది. చివరకు హైకోర్టు ఆదేశంతో ఈ నెల 30న సరూర్ నగర్ స్టేడియం పరిధిలో నిర్వహణకు మార్గం సుగమమైంది. టీఎస్‌పీఎస్సీ చేసిన ప్రకటన ప్రకారమే ఏడు వేల మందికిమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఏ ఆధారాల ప్రకారం మంత్రులు దాదాపు 27 వేల ఉద్యోగాల నియామకం జరిగిందని ప్రకటించారో అర్థం గానీ పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా తప్పుదోవ పట్టించాల్సిన అవసరమేమిటో అమాత్యుల వారికే తెలియాల్సి ఉన్నది. ఉద్యోగ నియామకాల సంగతి చెప్పకుండా ప్రశ్నించిన విపక్షాలపై విమర్శలతో కాలం గడిపితే ప్రయోజనమేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Government dissappointed unemployed youth while defence on creation jobs. Ministers Harish Rao and Etela Rajeder were prioritised to attacked opposition parties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి