మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్; బ్యాలెట్ బాక్సులలో అభ్యర్థుల భవితవ్యం!!
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కు సంబంధించి నిన్న సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లతో సిబ్బంది అధికారులు తరలి వెళ్లారు.
మొదలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్
నేడు పోలింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య నేడు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఎన్నికల బరిలోకి దిగారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాలలోనూ మొత్తం 650 పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నేడు పోలింగ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటర్లుగా ఎన్రోల్ చేసుకున్నారు. వీరంతా నేడు తమ ఓటు హక్కును శాసనమండలిలో తమ గళాన్ని వినిపించే వ్యక్తిని ఎన్నుకోవడానికి ఉపయోగించనున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది.
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇలా
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73, 406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బిజెపి నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తో పాటు 49 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో విశేషంగా ప్రచారం చేశారు.
సిట్టింగ్ స్థానం కోసం బీఆర్ఎస్ పోరు.. ఓటరు తీర్పుపై ఉత్కంఠ
ఇక నేడు వీరందరి భవితవ్యం ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు బ్యాలెట్ బాక్స్ లలో భద్రపరచనున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవటంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్, బిజెపిలు ఎమ్మెల్సీ తమ సొంతం చేసుకోవాలని పోరాడుతున్నారు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఏం తీర్పు ఇస్తారు అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications