తెలంగాణాలో జోరందుకున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు!
కేంద్రప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జాతీయ రహదారుల అభివృద్ధికి కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంచిర్యాల జిల్లా నుండి వరంగల్ వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో మంథని మండలంలో జాతీయ రహదారి పనులు జోరందుకున్నాయి. మొత్తం 18కిలోమీటర్ల దూరం నిర్మించనున్న ఈ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులను మూడు ప్యాకేజీల కింద విభజించి నిర్మాణం చేస్తున్నారు.
మూడు ప్యాకేజీలుగా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం
ఒకటవ ప్యాకేజీలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్ పల్లి నుంచి మంథని మండలం పుట్టపాక వరకు 31 కిలోమీటర్ల దూరం నిర్మించనున్నారు. మొత్తం 873 కోట్ల వ్యయంతో ఒకటవ ప్యాకేజీ నిర్మాణం చేయనున్నారు. ఇక రెండవ ప్యాకేజీ కింద పుట్టపాక నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి వరకు 38 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు. దీనికి 881 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.

మూడు ప్యాకేజీలకు కలిపి 2606 కోట్ల రూపాయల అంచనా
ఇక మూడవ ప్యాకేజీ కింద భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి నుండి హనుమకొండ జిల్లా ఊరుకొండ వరకు 39 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు. ఇక దీనికి 851 కోట్ల రూపాయలను కేటాయించి నిర్మాణం జరపనున్నారు. మొత్తం మూడు ప్యాకేజీలకు కలిపి 2606 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేస్తున్నారు.
మంథని మండలంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి
ఈ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు 2021 ఆగస్టులో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం మంథని మండలంలో ఈ భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో ప్రభుత్వం ఆ భూములను జాతీయ రహదారి అథారిటీకి అప్పగించగా నిర్మాణం ప్రారంభమైంది.
జోరందుకున్న్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు
మొదటి ప్యాకేజీలో భాగంగా 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలు రహదారిని నిర్మించనున్నారు. జైపూర్ మండలం నర్సింగాపూర్, చెట్టుపల్లి, నాగారంలో ఫ్లైఓవర్లు, పోతారం దగ్గర గోదావరి నదిపై వంతెన, పుట్టపాకలో జంక్షన్, ఓడేడ్ వద్ద మానేరు పై వంతెన డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మొదటి ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండేళ్లలో ఈ జాతీయ రహదారి మొదటి ప్యాకేజీ పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications