తాజా గ్రూప్-1 ఎంపిక జాబితా ఉపసంహరణ: అసలేం జరిగిందంటే..?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గ్రూప్‌-1 తుది ఫలితాల్లో ప్రాధాన్యతలు తారుమారయ్యాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. రెండు రోజుల క్రితం ప్రకటించిన జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు సంబంధించిన సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలతో పోస్టుల ప్రాధాన్యతా క్రమం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఫలితాల అనంతరం అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

సీజీజీ నుంచి ప్రాథమిక విచారణ నివేదిక తెప్పించుకుని జరిగిన పొరపాటును గుర్తించింది. అక్టోబర్ 28న ప్రకటించిన జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తుది ఫలితాలు వెల్లడించిన వారంరోజులకు ఇంటర్వ్యూకు హాజరైనవారి మార్కుల జాబితాను కూడా విడుదలచేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది.

కాగా, గ్రూప్1 ఫలితాల్లో చోటు చేసుకున్న గందరగోళంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దృష్టి సారించారు. సీజీజీ లోపాలతో పొరపాట్లు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో విచారణ నిర్వహించి.. నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. దీంతో సోమవారం రాజీవ్‌శర్మ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

group 1 selection list withdrawal

పొరపాటు ఎక్కడ జరిగిందంటే..?
టీఎస్‌పీఎస్సీ ఆదివారం గ్రూప్1 మెరిట్‌జాబితాను వెల్లడించాయి. ఈ జాబితాలో టాప్‌-10లో నిలిచిన అభ్యర్థులు తమ ర్యాంకులను మీడియా ద్వారా తెలుసుకున్నారు. రాత, మౌఖిక పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందినా ఆశించిన పోస్టులు రాకపోవడంపై టాపర్లుగా నిలిచిన అభ్యర్థులు విస్మయం చెందారు. నాలుగు, తొమ్మిది ర్యాంకులు పొందిన మహిళా అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణిని కలిశారు. మార్కులకు తగిన పోస్టులు రాలేదని ఫిర్యాదు చేశారు. తామిచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోలేదని చూపించారు.

చివరి ప్రాధాన్యతా క్రమంలో 17వ ఆప్షన్‌ కింద ఇచ్చిన ఎంపీడీవో పోస్టు, సీజీజీ వెబ్‌ఆప్షన్లలో పరిశీలించగా రెండో ప్రాధాన్యత పోస్టుగా కనిపించడాన్ని గుర్తించారు. వెంటనే రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ఛైర్మన్‌ కోరారు. ఇద్దరు అభ్యర్థులు తాము వెబ్‌ఆప్షన్ల సమయంలో ప్రింటు తీసుకున్న జాబితాను వారికిచ్చారు. ఈ జాబితాను పరిశీలించిన టీఎస్‌పీఎస్సీ సీజీజీలో సాంకేతిక పొరపాటు జరిగినట్లు ప్రాథమిక అంగీకరించింది.

అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే, డైరెక్టర్‌ టి.విజయకిరణ్‌తో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీజీజీ అందించిన ఆన్‌లైన్‌ వెబ్‌ఆప్షన్ల ప్రకారం ఎంపిక జాబితాను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీకి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక పొరపాటుపై సీజీజీ అధికారులతో నివేదిక తెప్పించుకున్నారు. సీజీజీ ఇచ్చిన డేటాను ర్యాండమ్‌గా పరిశీలించగా.. అభ్యర్థులు ఇచ్చిన వెబ్‌ఆప్షన్లు క్రమానుసారం రాలేదని తేలింది. దీంతో మొత్తం డేటాను తనిఖీ చేయాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఆదేశించారు.

ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ వెబ్‌ఆప్షన్ల సమయంలో ముందు జాగ్రత్తగా అభ్యర్థుల నుంచి పీడీఎఫ్‌ కాపీలను తీసుకుంది. ఇప్పుడు ఆఫైలును బయటకు తీయనుంది. మార్కుల్లో ఎలాంటి పొరపాట్లు లేవని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వెబ్‌ఆప్షన్లలోనే పొరపాట్లు ఉన్నందున.. అభ్యర్థులు ఇచ్చిన కాపీలను, సీజీజీ వెబ్‌ఆప్షన్లతో పూర్తిగా ఒకొక్కటీ తనిఖీ చేయనుంది. ఆ మేరకు తుది వెబ్‌ఆప్షన్ల జాబితాతో సవరణ జాబితాను ప్రకటించనుంది. సరైన వెబ్‌ఆప్షన్లు తీసుకుని సవరణ జాబితాను ప్రకటించనుండటంతో కొందరి పోస్టులు మారనున్నాయి. పోస్టులు కొందరికి మాత్రమే మారే అవకాశాలున్నాయని టీఎస్‌పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది ఇలా ఉండగా, గ్రూప్‌-1 తుది ఫలితాల్లో చోటు చేసుకున్న గందరగోళంపై విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం అభ్యర్థులు నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. అక్టోబర్ 28న వెలువరించిన ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మౌఖిక పరీక్ష ముగిసిన మర్నాడే మార్కులు, మెరిట్‌ జాబితాను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ఏకంగా తుదిజాబితాను విడుదల చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. టాప్‌-10 జాబితాలోనే ఇన్ని అవకతవకలు జరిగితే మెరిట్‌ మార్కుల లిస్టులు, 121 ర్యాంకుల జాబితా ప్రకటిస్తే ఇంకెన్ని తప్పిదాలుంటాయోనని ఆందోళన వ్యక్తంచేశారు. తాము సంతకం పెట్టిన వెబ్‌ ఆప్షన్లు చూపాలని డిమాండ్‌ చేసినా బహిర్గతం చేయకుండా అధికారులు గోప్యత వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TSPSC said that Telangana Group-1 selection list has been withdrawn.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి